Rohit Breaks Yuvraj Record: యువీ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్.. అత్యధిక సిక్సర్ల ఘనత-rohit sharma breaks yuvraj singh most sixes record in t20 world cup ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Breaks Yuvraj Record: యువీ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్.. అత్యధిక సిక్సర్ల ఘనత

Rohit Breaks Yuvraj Record: యువీ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్.. అత్యధిక సిక్సర్ల ఘనత

Maragani Govardhan HT Telugu
Oct 27, 2022 06:22 PM IST

Rohit Breaks Yuvraj Record: నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (AP)

Rohit Breaks Yuvraj Record: సిడ్నీ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అర్ధశతకాలు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ విజయంతో పాటు టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ అరుదైన ఘనతను సాధించాడు. టీ20 వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్ క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేశాడు.

పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ ఘనత యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. తాజాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అతడు బాదిన మూడో సిక్సర్‌తో ఆ రికార్డు బద్దలైంది. యువరాజ్ సింగ్ టీ20ల్లో అత్యధికంగా 33 సిక్సర్లు బాదగా.. రోహిత్ శర్మ 34 సిక్సర్లు కొట్టి ఆ రికార్డును అధిగమించాడు.

ఈ రికార్డుతో పాటు మరో ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు రోహిత్ శర్మ. టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా దిల్షాన్ రికార్డును సమం చేశాడు. హిట్ మ్యాన్ ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్‌లో 35 మ్యాచ్‌లు ఆడాడు. శ్రీలంక మాజీ ప్లేయర్ దిల్షాన్ కూడా ఇన్నే మ్యాచ్‌లు ఆడటం గమనార్హం.

తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో విజృంభించిన విరాట్ కోహ్లీ(62).. మరోసారి బ్యాట్ ఝుళిపించాడు. ఈ సారి కూడా అర్ధశతకంతో ఆకట్టుకోగా.. అతడికి కెప్టెన్ రోహిత్ శర్మ(53), సూర్యకుమార్(51) అర్ధసెంచరీలతో తోడుగా నిలిచారు. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 9 వికెట్లు కోల్పోయి కేవలం 123 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం