Ravi Shastri on Kohli: అప్పుడు కోహ్లికే కెప్టెన్సీ ఇస్తారనుకున్నా.. ఇంకొక్కసారి కెప్టెన్‌గా చూడాలని ఉంది: రవిశాస్త్రి
Ravi Shastri on Kohli: అప్పుడు కోహ్లికే కెప్టెన్సీ ఇస్తారనుకున్నా.. ఇంకొక్కసారి అతన్ని కెప్టెన్‌గా చూడాలని ఉంది అంటూ మాజీ కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు.
Ravi Shastri on Kohli: ఇండియన్ క్రికెట్ లో ఒక్కో ప్లేయర్ కు ఒక్కో గాడ్ ఫాదర్ ఉంటాడు. అలా విరాట్ కోహ్లికి కూడా మాజీ కోచ్ రవిశాస్త్రి రూపంలో ఓ గాడ్ ఫాదర్ ఉన్నాడు. శాస్త్రి కోసం అప్పట్లో కోచ్ గా ఉన్న కుంబ్లేతోనూ విరాట్ గొడవ పెట్టుకున్నాడు. కుంబ్లే దిగిపోయిన తర్వాత మరోసారి రవిశాస్త్రి కోచ్ అయ్యాడు. అలాంటి శాస్త్రి.. ఇప్పుడు తన శిష్యుడు కోహ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
అతన్ని ఇంకొక్కసారి టీమిండియా కెప్టెన్ గా చూడాలని ఉందని అనడం విశేషం. క్రికిన్ఫోతో మాట్లాడిన శాస్త్రి.. గతేడాది ఇంగ్లండ్ తో జరిగిన చివరి టెస్టులో కోహ్లికే కెప్టెన్సీ ఇస్తారని భావించినట్లు చెప్పాడు. ఆ మ్యాచ్ కు రోహిత్ కొవిడ్ వల్ల దూరం కావడంతో బుమ్రా కెప్టెన్ అయిన విషయం తెలిసిందే. తాను ఉండి ఉంటే మాత్రం విరాట్ కే మరోసారి కెప్టెన్సీ ఇచ్చేవాడినని స్పష్టం చేశాడు.
"అతడే కెప్టెన్సీ చేపడతాడని భావించాను. రోహిత్ గాయపడిన (కొవిడ్ ఇన్ఫెక్షన్) తర్వాత కోహ్లినే కెప్టెన్సీ చేపట్టమని అడుగుతారని భావించాను. నేను ఉండి ఉంటే అదే పని చేసేవాడిని. రాహుల్ ద్రవిడ్ కూడా అదే చేసేవాడేమో. కానీ నాకు తెలియదు. నేను అతనితో మాట్లాడలేదు. నేనైతే బోర్డుకు కోహ్లి పేరే చెప్పేవాడిని. ఎందుకంటే అంతకుముందు ఏడాది జరిగిన నాలుగు టెస్టుల్లో 2-1 లీడ్ సాధించినప్పుడు కోహ్లియే కెప్టెన్ గా ఉన్నాడు. అతడే టీమ్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టేవాడు" అని శాస్త్రి అన్నాడు.
మరి కోహ్లియే మళ్లీ కెప్టెన్సీ చేపట్టడానికి సంకోచించాడా అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ ఉండదని చెప్పాడు. "అవకాశమే లేదు. దేశాన్ని లీడ్ చేయడం గొప్ప గౌరవం. ఇలాంటి పరిస్థితుల్లోనే ముందుకు రావాలి. రెగ్యులర్ కెప్టెన్ గాయపడ్డాడు. జట్టులో లేడు. ఇంగ్లండ్ ను ఇంగ్లండ్ లో ఓడించే అవకాశం. అప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్నాం. అదే ఏడాదిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను ఎన్ని టీమ్స్ ఓడించాయి?" అని శాస్త్రి అన్నాడు.
అంతేకాదు ఇంకొక్కసారి విరాట్ కోహ్లిని టీమిండియా కెప్టెన్ గా చూడాలని ఉన్నట్లు కూడా రవిశాస్త్రి చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఐపీఎల్లో డుప్లెస్సి గాయపడటంతో మూడు మ్యాచ్ ల నుంచి కోహ్లి ఆర్సీబీ కెప్టెన్సీ చేపట్టిన విషయం తెలిసిందే. అందులో రెండింట్లో ఆర్సీబీ గెలిచింది.
సంబంధిత కథనం