MS Dhoni: “ధోనీ.. ఒంటికాలిపై ఐపీఎల్ ఆడాడు.. అతడో వారియర్”: టీమిండియా మాజీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్‍లో చెన్నైసూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనిపై లక్ష్మణ్ శివరామకృష్ణన్ ప్రశంసల వర్షం కురిపించారు. ధోనీ ఓ వారియర్ అన్నారు.
MS Dhoni: అభిమానులకు బహుమతిగా తాను వచ్చే ఐపీఎల్ సీజన్ కూడా ఆడేందుకు ప్రయత్నిస్తానని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. గత వారం.. సీఎస్‍కే జట్టుకు అయిదోసారి ఐపీఎల్ టైటిల్ అందించాక ధోనీ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే అందుకు తన శరీరం సహకరించాలని అన్నాడు. ఐపీఎల్ 2023 ఫైనల్‍లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి సీఎస్‍కే టైటిల్ సాధించింది. అయితే ఈ 16వ సీజన్ అంతా కెప్టెన్ ధోనీ.. మోకాలి గాయంతోనే ఆడాడు. మైదానంలో నడిచిన తీరును చూస్తేనే ఇది అర్థమైంది. తాజాగా ధోనీ మోకాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఈ తరుణంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్.. ధోనీపై ప్రశంసల వర్షం కురిపించారు. సీజన్ అంతా ధోనీ ఒంటికాలిపై ఆడాడని, అతడో వారియర్ అంటూ కొనియాడారు.
ఎస్ఎస్ ధోనీది పోరాట యోధుడి మనస్తత్వం అని, అంత నొప్పితోనూ అతడు జట్టుకు సారథ్యం వహించిన తీరు అద్భుతమని శివరామకృష్ణన్ ప్రశంసించారు. ధోనీ ఓ చాంపియన్ అంటూ ట్వీట్ చేశారు.
“ఎంఎస్ ధోనీకి మోకాలిశస్త్ర చికిత్స పూర్తయింది. అది విజయవంతమైంది. అతడు ఒకకాలితో ఆడాడు. నొప్పి వల్ల ఎంత వేదన కలిగినా.. అది అతడి ఆలోచనల స్పష్టతను ప్రభావితం చేయలేదు. అంత నొప్పితోనూ అతడు జట్టును ముందుకు నడిపిన తీరు అద్భుతం. అతడిది పోరాటయోధుడి మనస్తత్వం. అతడో చాంపియన్” అని లక్ష్మణ్ శివరామకృష్ణన్ ట్వీట్ చేశారు.
ధోనీ మోకాలికి సర్జరీ విషయాన్ని సీఎస్‍కే సీఈవో కాశీ విశ్వనాథ్ కూడా ధ్రువీకరించారు. “అవును, ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో ధోనీకి మోకాలి శస్త్రచికిత్స గురువారం విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం అతడు బాగున్నాడు. సర్జరీ ఉదయమే జరిగింది. ఇంక మిగిలిన వివరాలు నాకు వరకు రాలేదు” అని కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు.
అయితే, మోకాలికి కీహోల్ సర్జరీ తర్వాత ఆసుపత్రి నుంచి ఇప్పటికే ధోనీ డిశ్చార్జ్ అయ్యాడని తెలుస్తోంది. అతడు రాంచీకి వెళ్లాడని సమాచారం.
“ఇప్పటికే అతడు (ధోనీ) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. రాంచీకి తిరిగి వెళ్లిపోయాడు. కొంతకాలం ఇంట్లో అతడు విశ్రాంతి తీసుకుంటాడు. ఆ తర్వాత రీహాబిలిటేషన్ ప్రారంభం అవుతుంది. తర్వాతి ఐపీఎల్ కోసం మళ్లీ ఫిట్‍గా తయారయ్యేందుకు అతడికి తగినంత సమయం ఉందని మేం భావిస్తున్నాం” అని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ఓ అధికారి పీటీఐతో చెప్పారు.