Messi Mania: మెస్సీకి ఉన్న క్రేజ్ ఇదీ.. డిసెంబర్‌లో పుట్టిన ప్రతి 70 మంది పిల్లల్లో ఒకరికి అతని పేరే..
Messi Mania: మెస్సీకి ఉన్న క్రేజ్‌కు ఇది నిదర్శనం. డిసెంబర్‌లో పుట్టిన ప్రతి 70 మంది పిల్లల్లో ఒకరికి అతని పేరే పెట్టారంటే అతని మానియా ప్రపంచాన్ని ఎంతలా కమ్మేసిందో అర్థం చేసుకోవచ్చు.
Messi Mania: లియోనెల్ మెస్సీ.. కొన్నాళ్లుగా ఈ పేరు ప్రపంచాన్ని ఊపేస్తోంది. గతేడాది డిసెంబర్ 18న జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనాను మూడోసారి విశ్వవిజేతగా నిలిపిన మెస్సీ.. తన వరల్డ్‌కప్ కలను సాకారం చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచీ మెస్సీ పేరు మార్మోగిపోతోంది. సొంత దేశం అర్జెంటీనాలో అతనితోపాటు టీమ్‌కు ఏస్థాయిలో స్వాగతం పలికారో మనం చూశాం.
తమ హీరోలను చూడటానికి సుమారు 40 లక్షల మంది రోడ్లపైకి వచ్చారు. మెస్సీ మెస్సీ నినాదాలతో కొన్నాళ్లపాటు అర్జెంటీనా మార్మోగిపోయింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. అర్జెంటీనాలో డిసెంబర్‌లో పుట్టిన పిల్లల్లో ప్రతి 70 మందిలో ఒకరికి లియోనెల్ లేదా లియోనెలా అనే పేర్లు పెట్టారట. సాంటా ఫె ప్రావిన్స్‌లోని సివిల్ రిజిస్ట్రీ చూస్తే ఇది స్పష్టమవుతోంది.
గతేడాది సెప్టెంబర్ వరకూ ఇలాంటి పేర్లు ఉన్న పిల్లల సంఖ్య నెలకు ఆరుగా ఉండేది. అది అక్టోబర్, నవంబర్ నెలల్లో 32కు చేరింది. ఇక డిసెంబర్‌లో అర్జెంటీనా వరల్డ్‌కప్ గెలవడంతో ఈ పేర్లు ఉన్న పిల్లల సంఖ్య ఏకంగా 49కు చేరడం విశేషం. ఒక్క మెస్సీయే కాదు.. వరల్డ్‌కప్ గెలిచిన టీమ్‌లోని మిగతా సభ్యుల పేర్లు పెట్టుకోవడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
అర్జెంటీనా టీమ్‌లోని జూలియన్, ఎమిలియానోలాంటి వాళ్ల పేర్లు కూడా రిజిస్టర్ అయినా కూడా ఎక్కువగా లియోనెల్ పేరే రిజిస్టర్ అయినట్లు సివిల్ రిజిస్ట్రీ స్పష్టం చేస్తోంది. అర్జెంటీనా తరఫున చాన్నాళ్లుగా ఫుట్‌బాల్ ఆడుతున్నా వరల్డ్‌కప్ గెలవలేదన్న బాధ మెస్సీకి ఇన్నాళ్లూ ఉండేది. అయితే ఇప్పుడా కల కూడా నెరవేరింది.
1986 తర్వాత తొలిసారి అర్జెంటీనా టీమ్ వరల్డ్‌కప్ గెలిచింది. మొత్తంగా ఆ టీమ్ విశ్వవిజేతగా నిలవడం ఇది మూడోసారి. 2022 వరల్డ్‌కప్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీల్లో 4-2తో ఓడించిన అర్జెంటీనా మెస్సీ సారథ్యంలో తొలిసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మెస్సీ ఏడు గోల్స్ చేసి గోల్డెన్ బాల్ అవార్డు గెలిచాడు. రెండుసార్లు ఈ అవార్డు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా కూడా మెస్సీ నిలిచాడు.
సంబంధిత కథనం