Messi Hotel Room as Museum: ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ ఉన్న హోటల్ రూమ్.. ఇక ఓ మ్యూజియం
Messi Hotel Room as Museum: ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ ఉన్న హోటల్ రూమ్.. ఇక ఓ మ్యూజియం కానుంది. ఈ విషయాన్ని ఖతార్ యూనివర్సిటీ బుధవారం (డిసెంబర్ 28) అనౌన్స్ చేసింది.
Messi Hotel Room as Museum: లియోనెల్ మెస్సీ.. ఇప్పుడు ఫుట్‌బాల్ ఫ్యాన్స్ అందరూ అతన్ని ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. ఇన్నాళ్లూ అత్యుత్తమ ప్లేయర్స్‌లో ఒకడిగా ఉన్న మెస్సీ.. తాజాగా తన ఫిఫా వరల్డ్‌కప్ కలను కూడా నెరవేర్చుకున్న విషయం తెలుసు కదా. 35 ఏళ్ల మెస్సీ.. అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపాడు.
1986 తర్వాత అర్జెంటీనాకు ఇదే తొలి వరల్డ్‌కప్ కాగా.. మొత్తంగా ఇది మూడోది కావడం విశేషం. ఈ వరల్డ్‌కప్‌ను ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కనిపించిన మెస్సీ.. అర్జెంటీనా తరపున ఏడు మ్యాచ్‌లలో ఏడు గోల్స్ చేశాడు. ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లోనూ రెండు గోల్స్ చేశాడు. దీంతో టోర్నీలో బెస్ట్ ప్లేయర్‌కు ఇచ్చే గోల్డెన్ బాల్ అవార్డును గెలుచుకున్నాడు.
ఫిఫా వరల్డ్‌కప్‌లో రెండుసార్లు గోల్డెన్ బాల్ అందుకున్న తొలి ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. ఈ ఘనతతో మెస్సీ క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఇప్పుడు ఫిఫా వరల్డ్‌కప్ కోసం ఖతార్‌లో మెస్సీ బస చేసిన హోటల్ రూమ్‌ను ఓ మ్యూజియంగా మార్చాలని ఖతార్ యూనివర్సిటీ నిర్ణయించడం గమనార్హం. దోహాలో మెస్సీతోపాటు అర్జెంటీనా స్ట్రైకర్ సెర్గియో ఆగెరో ఒకే హోటల్ రూమ్‌లో ఉన్నారు.
అయితే ఇక నుంచి ఆ రూమ్‌ను ఎవరికీ ఇవ్వకూడదని నిర్ణయించారు. అందులో మెస్సీకి సంబంధించిన వస్తువులతో ఓ చిన్న మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఖతారీ న్యూస్ ఏజెన్సీ క్యూఎన్‌ఏ వెల్లడించింది. ఈ మ్యూజియాన్ని విద్యార్థులు, టూరిస్టులు సందర్శించే అవకాశం కల్పించారు.
"అర్జెంటీనా టీమ్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ బస చేసిన హోటల్ రూమ్‌ను అలాగే ఉంచుతాం. ఈ రూమ్‌కు కేవలం సందర్శకులకు మాత్రమే అవకాశం కల్పిస్తాం. ఆ హోటల్ రూమ్ ఇక భవిష్యత్తులో మరెవరికీ కేటాయించం. మెస్సీకి చెందిన వస్తువులు విద్యార్థులు, భవిష్యత్తు తరాలకు ఓ పాఠంగా నిలుస్తాయి. అతడు వరల్డ్‌కప్ సందర్భంగా సాధించిన ఘనతలేంటో వారికి తెలుస్తాయి" అని ఖతార్ యూనివర్సిటీ డైరెక్టర్ హిత్మి అల్ హిత్మి చెప్పారు.
సంబంధిత కథనం