Messi on Currency Notes: కరెన్సీ నోట్లపై మెస్సీ.. అర్జెంటీనా సంచలన నిర్ణయం?
Messi on Currency Notes: కరెన్సీ నోట్లపై మెస్సీ ఫొటో ముద్రించాలని అర్జెంటీనా సంచలన నిర్ణయం తీసుకుందా? ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే అక్కడి సెంట్రల్ బ్యాంక్ ఈ ప్రతిపాదన చేయడం గమనార్హం.
Messi on Currency Notes: ఫుట్‌బాల్ అంటే ప్రాణమిచ్చే సౌత్ అమెరికన్ దేశం అర్జెంటీనా. ఆ దేశంలోనే కాదు ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా అర్జెంటీనా టీమ్‌కు అభిమానులు ఉన్నారు. ఈ మధ్య ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌ను అర్జెంటీనా గెలవడం కోట్లాది మంది అభిమానులను ఆనందానికి గురి చేసింది. ఆ ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన మెస్సీ సేనకు స్వాగతం పలకడానికి ఏకంగా 40 లక్షల మంది రోడ్లపైకి రావడం కూడా మనం చూశాం.
అంతలా ఫుట్‌బాల్‌ను, మెస్సీని అక్కడి ప్రజలు ఆరాధిస్తారు. ఇప్పుడు అర్జెంటీనాకు 36 ఏళ్ల తర్వాత మరోసారి వరల్డ్‌కప్ ట్రోఫీ అందించిన మెస్సీని ఏకంగా అక్కడి కరెన్సీ నోట్లపైనే ఉంచాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అర్జెంటీనా సెంట్రల్ బ్యాంక్ అక్కడి 1000 పెసో బ్యాంక్‌నోట్‌పై మెస్సీ ఫొటోను ముద్రించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచడం గమనార్హం.
సెంట్రల్ బ్యాంక్ అధికారులు ఈ ప్రతిపాదన చేసినట్లు అక్కడి ఫైనాన్షియల్ న్యూస్‌పేపర్ ఎల్ ఫైనాన్సియెరో వెల్లడించింది. ఫిఫా వరల్డ్‌కప్ 2022 విజయానికి గుర్తుగా ఈ నిర్ణయం తీసుకోవాలని వాళ్లు కోరినట్లు ఆ పత్రిక తెలిపింది. నిజానికి ఖతార్‌లో ఆ ఫైనల్ మ్యాచ్ జరగడానికి ముందే అర్జెంటీనా సెంట్రల్ బ్యాంక్ అధికారులు ఆ దిశగా పనులు మొదలు పెట్టినట్లు కూడా వివరించింది.
అయితే సెంట్రల్ బ్యాంక్ అధికారులు ఏదో సరదాగా ఈ ప్రతిపాదన చేసినట్లు కూడా చివరికి చెప్పడం విశేషం. ఇక 1000 పెసో నోటే ఎందుకు అంటే.. మెస్సీ జెర్సీ నంబర్ 10కి ఇది మ్యాచ్ అవుతుందని. "అందరూ మరో విధంగా అనుకునేరు. ఈ ప్రతిపాదనను అర్జెంటీనా సెంట్రల్ బ్యాంక్ అధికారులు కేవలం సరదాగా చేసింది మాత్రమే. అయితే బ్యాంక్‌లోని కొందరు డైరెక్టర్లు మెస్సీ ఫొటోను నిజంగానే కరెన్సీ నోట్లపై ముద్రించడానికి సిద్ధంగా ఉన్నారు" అని ఎల్ ఫైనాన్సియెరో రిపోర్ట్ చేసింది.
నిజానికి 1978లో తొలిసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను గెలిచినప్పుడు దానిని సెలబ్రేట్ చేసుకోవడానికి అర్జెంటీనా కొన్ని స్మారక నాణేలాను రిలీజ్ చేసింది. ఇక ఇప్పుడు కరెన్సీ నోటుకు ఓవైపు మెస్సీ, మరోవైపు అర్జెంటీనా కోచ్ లియో స్కలోనీ ఫొటోలను ముద్రించాలన్న ప్రతిపాదన రావడం విశేషం.