Budweiser Beers to Argentina Fans: ఆ బీర్లన్నీ అర్జెంటీనా అభిమానులకే ఫ్రీగా పంచేసిన బడ్‌వైజర్
Budweiser Beers to Argentina Fans: ఆ బీర్లన్నీ అర్జెంటీనా అభిమానులకే ఫ్రీగా పంచేసింది బడ్‌వైజర్ కంపెనీ. ఖతార్‌లో ఫిఫా వరల్డ్‌కప్ సందర్భంగా తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.
Budweiser Beers to Argentina Fans: ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ సూపర్ సక్సెస్ అయిన విషయం తెలుసు కదా. ఎన్నో సంచలనాలు, మరెన్నో నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్‌ల తర్వాత చివరిగా డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌ను ఫైనల్లో ఓడించి అర్జెంటీనా మూడోసారి వరల్డ్‌కప్ గెలుచుకుంది. 36 ఏళ్ల తర్వాత ఆ టీమ్ గెలిచిన తొలి వరల్డ్‌కప్ ఇదే కాగా.. స్టార్ ప్లేయర్ మెస్సీ తన వరల్డ్‌కప్ ట్రోఫీ కలను కూడా నెరవేర్చుకున్నాడు.
అయితే ఈ వరల్డ్‌కప్ అంతా బాగానే ఉన్నా.. ఒక్క విషయంలో మాత్రం అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టేడియాల్లో బీర్లు తాగుతూ మ్యాచ్‌లను చూడాలన్న వాళ్ల ఆశ నెరవేరలేదు. ఖతార్‌లో పబ్లిగ్గా మందు తాగడంపై నిషేధం ఉండటంతో చివరి నిమిషంలో నిర్వాహకులు స్టేడియాల దగ్గర బీర్ల అమ్మకాలను నో చెప్పారు. దీంతో అటు ఫ్యాన్సే కాదు.. ఇటు భారీ ఎత్తున బీర్లను సిద్ధం చేసుకున్న బడ్‌వైజర్ కూడా నిరాశకు గురైంది.
అయితే అదే సమయంలో ఆ సంస్థ ఓ ప్రకటన కూడా చేసింది. వరల్డ్‌కప్ గెలిచిన దేశానికి ఆ బీర్లన్నీ ఇచ్చేస్తామంటూ ఓ ఫొటోను తమ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. అందులో భారీ ఎత్తున నిల్వ చేసిన బీర్ క్యాన్లు ఉన్నాయి. వీటిని గెలుచుకునే లక్కీ దేశం ఏదో అంటూ ఆ ట్వీట్ చేసింది. ఇప్పుడు అర్జెంటీనా గెలవడంతో బడ్‌వైజర్ సంస్థ ఇచ్చిన మాట ప్రకారం ఆ దేశంలో బీర్లను ఫ్రీగా పంచి పెడుతోంది.
అర్జెంటీనాలో ఫ్రీగా పంచడానికి ఓ స్పెషల్ ఎడిషన్‌ను బడ్‌వైజర్ తీసుకొచ్చింది. వీటిపై లియోనెల్ మెస్సీ ఫొటోలను ఆ సంస్థ ప్రింట్ చేసింది. ఇవి కేవలం అర్జెంటీనాలోనే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో అభిమానికి ఒక రోజుకు మూడు 410 మి.లీ. క్యాన్లను బడ్‌వైజర్ ఇస్తోంది. వీటిని ఫ్యాన్స్‌కు ఫ్రీగా పంచడానికి ప్రత్యేకంగా డెలివరీ పాయింట్లను ఏర్పాటు చేసింది.
#BringHomeTheBud ప్రచారంలో భాగంగా వీటిని సెట్ చేసింది. బీర్లు కావాలనుకున్న అభిమానులు.. ఓ ఫామ్‌ను ఫిల్ చేసి వాటిని పొందవచ్చని ప్రకటించింది. ఫ్రీగా బీర్లు ఇస్తామంటే ఎవరు మాత్రం కాదంటారు. ఊహించినట్లే వాటి ముందు క్యూ కట్టారు. అర్జెంటీనా టీమ్ పుణ్యామా అని ఇప్పుడా దేశంలోని బీర్ లవర్స్ ఫ్రీగా బడ్‌వైజర్ బీర్లను టేస్ట్ చేస్తున్నారు.