Kane Williamson Double Century: శ్రీలంకపై విలియమ్సన్ డబుల్ సెంచరీ - కోహ్లి తర్వాత అతడిదే ఈ రికార్డ్
Kane Williamson Double Century: శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో డబుల్ సెంచరీతో చెలరేగాడు న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్. ఈ క్రమంలో పలు రికార్డులను తిరగరాశాడు. ఆ రికార్డ్స్ ఏవంటే...
Kane Williamson Double Century: సూపర్ ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ శ్రీలంకపై డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. వెల్లింగ్‌టన్ వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న సెకండ్ టెస్ట్‌లో విలియమ్సన్ తో పాటు నికోలస్ డబుల్ సెంచరీలు చేయడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 120 ఓవర్లలోనే 580 పరుగులు చేసింది. వన్డే తరహాలో చెలరేగి ఆడారు విలియమ్సన్, నికోలస్.
విలియమ్సన్ 296 బాల్స్‌లో 23 ఫోర్లు, రెండు సిక్సర్లతో 215 పరుగులు చేయగా నికోలస్ 240 బాల్స్‌లో 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 200 పరుగులు చేసి ఔటయ్యారు. వీరిద్దరి జోడిని విడదీయడానికి శ్రీలంక బౌలర్లు శ్రమించాల్సివచ్చింది. కాగా విలియమ్సన్‌కు టెస్టుల్లో వరుసగా ఇది మూడో శతకం కావడం గమనార్హం. ఇంగ్లాండ్‌తో చివరి టెస్ట్‌తో పాటు శ్రీలంక తొలి టెస్ట్‌లో విలియమ్సన్ శతకాలు సాధించాడు.
రెండో టెస్ట్‌లో ఏకంగా డబుల్ సెంచరీ సాధించి టెస్ట్ క్రికెట్‌లో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. టెస్టుల్లో వరుసగా మూడు మ్యాచుల్లో సెంచరీలు సాధించిన నాలుగో న్యూజిలాండ్ ప్లేయర్‌గా విలియమ్సన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో బర్గెస్, రాస్ టేలర్, టామ్ లాథమ్, నికోలస్ మాత్రమే ఈ ఘనతను సాధించారు. ప్రస్తుతం ఉన్న యాక్టివ్ క్రికెటర్స్‌లో టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా విలియమ్సన్ రికార్డ్ నెలకొల్పాడు.
ఈ జాబితాలో ఏడు డబుల్ సెంచరీలతో కోహ్లి తొలి స్థానంలో నిలవగా ఆరు డబుల్ సెంచరీలతో విలియమ్సన్ రెండో స్థానంలో ఉన్నాడు.మొత్తంగా టెస్టుల్లో విలియమ్సన్‌కు ఇది 28వ సెంచరీ కావడం గమనార్హం. కోహ్లి కూడా టెస్టుల్లో 28 సెంచరీలు సాధించడం గమనార్హం.అంతే కాకుండా ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ఎనిమిది వేల పరుగుల్ని పూర్తిచేసుకున్నాడు విలియమ్సన్. టెస్టుల్లో ఈ ఘనతను సాధించిన ఏకైక న్యూజిలాండ్ క్రికెటర్‌గా నిలిచాడు.