Ishan About Dhoni: ధోనీనే నా స్ఫూర్తి.. అతడిని భర్తీ చేయాలనుకుంటున్నా.. ఇషాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Ishan About Dhoni: టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్.. ఎంఎస్ ధోనీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. చిన్నప్పటి నుంచి ధోనీ అంటే తనకు అమితమైన ఇష్టమని, అతడిని స్ఫూర్తిగా తీసుకొని జట్టులోకి వచ్చానని స్పష్టం చేశాడు. అతడి స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.
Ishan About Dhoni: టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్.. గత నెలలో బంగ్లాదేశ్‌పై వన్డేల్లో డబుల్ సెంచరీ చేసినప్పటి నుంచి సర్వత్రా చర్చనీయాంశంగా మారాడు. జట్టులో స్థానాన్ని మరింత పదిలం చేసుకున్న ఈ ప్లేయర్ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా భారత జట్టుతో కలిసి ఓ వీడియో ఇంటర్వ్యూలో మాట్లాడిన అతడు.. ఎంఎస్ ధోనీ గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. ధోనీనే తనకు ఆదర్శమని, అతడి స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.
నా ఫేవరెట్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ. అతడే నాకు స్ఫూర్తి. మేమిద్దరం ఒకే ఊరు నుంచి వచ్చాము. నేను కూడా ఝార్ఖండ్ తరఫున ఆడాను. నేను అతడి స్థానాన్ని భర్తీ చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఇక్కడ వరకు వచ్చాను. రాబోయే రోజుల్లోనూ జట్టుకు మరిన్ని విజయాలు అందించడంతో తోడ్పడతాను. అని ఇషాన్ కిషన్ తెలిపాడు.
తను ధోనీని మొదటి సారి కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు ఇషాన్ కిషన్. నేను ధోనీని నాకు 18 ఏళ్లున్నప్పుడు తొలిసారి కలిశాను. ఆయన నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నా బ్యాట్‌పై ధోనీ ఆటోగ్రాఫ్ ఇవ్వడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను అని ఇషాన్ కిషన్ స్పష్టం చేశాడు.
ఇషాన్ కిషన్ 14 ఏళ్లప్పుడు నుంచే ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదుగుదామని అనుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అరుదైన ఘనతలను సాధించాడు. ఇటీవలే అత్యంత వేగవంతమైన వన్డే డబుల్ సెంచరీ చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మూడు మ్యాచ్‌లో భారత్ 1-2 తేడాతో ఓటమి పాలైంది. మూడో మ్యాచ్‌లో ఇషాన్ డబుల్ సెంచరీ చేయడంతో జట్టు విజయాన్ని అందుకుంది.
శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ ఇషాన్ చోటు దక్కించుకున్నాడు. అందుతో తన సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ఈ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌కు కూడా ఇషాన్ ఎంపికయ్యాడు. వచ్చే నెలలో ఈ సిరీస్ ఆరంభం కానుంది.