Kohli on RCB defeat: విజయాన్ని వారి చేతుల్లో పెట్టేశాం.. ఓడిపోవడానికి అర్హులమే.. విరాట్ స్పష్టం
Kohli on RCB defeat: కోల్‌కతా చేతిలో బెంగళూరు ఓడిపోవడంపై విరాట్ కోహ్లీ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన అతడు.. ఈ ఓటమికి తాము పూర్తి అర్హులమే అంటూ స్పష్టం చేశాడు. అనేక తప్పిదాలతో విజయాన్ని వారి చేతుల్లో పెట్టేశామని తమ ప్లేయర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Kohli on RCB defeat: కోల్‌కతా నైట్ రైడర్స్ బుధవారం నాడు జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిన సంగతి తెలిసిందే. 201 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 179 పరుగులే చేసి 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. హోంగ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ ఆటగాళ్లు పదే పదే ఫీల్డింగ్ తప్పిదాలు చేశారని, క్యాచ్‌లు జారవిడిచారని, ఫలితంగా విజయాన్ని వారికి సమర్పించుకోవాల్సి వచ్చిందని కోహ్లీ స్పష్టం చేశాడు.
బెంగళూరు బౌలర్లు వ్యషాక్ విజయ్ కుమార్, హసరంగా చెరో రెండు వికెట్లతో రాణించినప్పటికీ ఇద్దరూ చెరో క్యాచ్ డ్రాప్ చేయడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కీలక సమయంలో ఈ ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా బెంగళూరు విజయాన్ని దూరం చేసుకోవాల్సి వచ్చింది. మరోపక్క కోల్‌కతా స్పిన్నర్లు అద్భుతంగా రాణించి.. ఆర్సీబీ బ్యాటర్లకు భారీగా పరుగులు చేసే అవకాశమే ఇవ్వలేదు. కీలక సమయంలో వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.
"నిజాయితీగా చెప్పాలంటే మేము మ్యాచ్‌ను వారి చేతుల్లో పెట్టేశాం. ఓడిపోవడానికి పూర్తిగా అర్హులం. విజయాన్ని వారికి అప్పగించేశాం. మ్యాచ్‌ను ఓ సారి గమనిస్తే.. మాకు వచ్చిన అవకాశాలను మేము సద్వినియోగం చేసుకోలేదు. కొన్ని క్యాచ్‌లు జారవిడవడం వల్ల 25 నుంచి 30 పరుగులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది." అని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.
"బ్యాటర్లు కూడా చెత్త బంతులకు వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ పెవలియన్ బాట పట్టారు. అది కూడా మా ఓటమికి కారణమైంది. అదనంగా మరో మంచి భాగస్వామ్యం చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మేము గేమ్‌లో కొన్ని మార్పులు చేయాలి. సాఫ్ట్ ప్లే ఆడకూడదు. మేము ఒకటి గెలిచాం.. మరొకటి ఓడిపోయాం. ఇది మమ్మల్ని ఆందోళన పెట్టే విషయం కాకపోయినప్పటికీ.. రాబోయే రోజుల్లో మంచి స్థితిలో ఉండాలంటే కొన్ని మ్యాచ్‌లు గెలవాలి" అని కోహ్లీ తెలిపాడు.
ఆర్సీబీతో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బెంగళూరు 179 పరుగులకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ(54) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మిగిలినవారు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. ఫలితంగా మ్యాచ్‌ను చేజార్చుకోవాల్సి వచ్చింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో అదరగొట్టగా.. సుయాష్ శర్మ, ఆండ్రూ రసెల్ చెరో 2 వికెట్లతో రాణించారు.