Harry Brook Ipl Records: కోల్‌కతాపై సెంచరీతో ఐపీఎల్‌లో పలు రికార్డులు బ్రేక్ చేసిన బ్రూక్ - ఆ రికార్డులు ఇవే
Harry Brook Ipl Records: ఐపీఎల్‌లో శుక్రవారం కోల్‌కతానైట్‌రైడర్స్‌పై అద్భుత శతకంతో చెలరేగాడు సన్‌రైజర్స్ ఓపెనర్ హ్యారీ బ్రూక్. ఈ సెంచరీతో ఐపీఎల్‌లో పలు రికార్డులను బ్రూక్ తిరగరాశాడు. ఆ రికార్డులు ఏవంటే...
Harry Brook Ipl Records: అద్భుత సెంచరీతో సన్‌రైజర్స్‌కు అదిరిపోయే విజయాన్ని అందించాడు హ్యారీ బ్రూక్. గత మూడు మ్యాచ్‌లలో పేలవమైన బ్యాటింగ్‌తో విమర్శలు ఎదుర్కొన్న బ్రూక్ శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 55 బాల్స్‌లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో పలు రికార్డులను బ్రూక్ తిరగరాశాడు. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన ఐదో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌గా బ్రూక్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
గతంలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ ఐపీఎల్‌లో ఐదు సెంచరీలు చేయగా, బెన్ స్టోక్స్ రెండు సెంచరీలు చేశాడు. వీరితో పాటు కెవిన్ పీటర్సన్, జానీ బెయిర్‌స్టో ఒక్కో సెంచరీలు సాధించారు. వారి తర్వాత ఈ ఘనతను సాధించిన ఐదో ప్లేయర్‌గా హ్యారీ బ్యూక్ నిలిచాడు.
అలాగే సన్‌రైజర్స్ టీమ్ నుంచి ఐపీఎల్‌లో సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా హ్యారీ బ్రూక్ రికార్డ్ సృష్టించాడు. గతంలో సన్‌రైజర్స్ తరఫున డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో మాత్రమే వంద పరుగుల మైలురాయిని అందుకున్నారు. వీరిద్దరు హోమ్ గ్రౌండ్ ఉప్పల్‌లోనే సెంచరీలు చేయగా బ్రూక్ మాత్రం కోల్‌కతా వేదికగా సెంచరీ బాదేశాడు. సొంత గ్రౌండ్ ఆవల సెంచరీ చేసిన తొలి సన్‌రైజర్స్ ప్లేయర్‌గా బ్రూక్ రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్‌లో తాను ప్రాతినిథ్యం వహించిన నాలుగో మ్యాచ్‌లోనే సెంచరీ చేశాడు బ్రూక్. అరంగేట్రం చేసిన అతి తక్కువ వ్యవధిలో సెంచరీ చేసిన ప్లేయర్‌గా బ్రూక్ రికార్డ్ దక్కించుకున్నాడు. గతంలో మైక్ హస్సీ, బ్రెండన్ మెక్‌కలమ్,తో పాటు పాల్ వాల్తాటీ ఎంట్రీలోనే సెంచరీలు చేశారు. ఆండ్రూ సైమండ్స్, బెయిర్ స్టో మూడో మ్యాచ్‌లో సెంచరీలు సాధించారు. వారి తర్వాత బ్రూక్ నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో బ్రూక్ సెంచరీతో(55 బాల్స్‌లో 100 రన్స్) పాటు మార్‌క్రమ్ (26 బాల్స్‌లో 50 రన్స్), అభిషేక్ శర్మ (17 బాల్స్‌లో 32 రన్స్) చెలరేగడంతో 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి సన్‌రైజర్స్ 228 రన్స్ చేసింది. లక్ష్యఛేదనలో పోరాడిన కోల్‌కతా 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 205 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ నితీష్ రానా (75 రన్స్), రింకు సింగ్ (58) రన్స్ పోరాడినా కోల్‌కతాకు విజయాన్ని అందించలేకపోయారు.