ICC Men's Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ హ్యారీ బ్రూక్
ICC Men's Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. ఈ ఇంగ్లండ్ బ్యాటర్ ఈ మధ్యే పాకిస్థాన్ టూర్‌లో అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.
ICC Men's Player of the Month: ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్.. గతేడాది డిసెంబర్ నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచాడు. ఈ రేసులో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రెవిస్ హెడ్ ఉన్నా.. వాళ్లను వెనక్కి నెట్టి ఈ అవార్డు గెలుచుకున్నాడు. తొలిసారి ఈ అవార్డుకు నామినేట్ అవడంతోపాటు దానిని గెలుచుకోవడం విశేషం. ఇక ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే గార్డ్‌నర్ ఐసీసీ వుమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచింది.

పాకిస్థాన్‌లో మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం వెళ్లే ముందు హ్యారీ బ్రూక్ తన కెరీర్‌లో ఒకే ఒక్క టెస్ట్ ఆడాడు. అయినా పాక్ గడ్డపై మూడు టెస్టుల్లో మూడు సెంచరీలతో చెలరేగిపోయాడు. కెరీర్‌లో తన రెండో టెస్ట్‌లోనే బ్రూక్ రెండు ఇన్నింగ్స్‌లో 153, 87 రన్స్ చేయడం విశేషం. పాకిస్థాన్‌లో ఆ టీమ్‌ను ఓడించి ఇంగ్లండ్‌కు సిరీస్ అందించడం తన కల నిజమైనట్లుగా అనిపించిందని బ్రూక్ చెప్పాడు.
"ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు గెలుచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. పాకిస్థాన్‌లో టెస్ట్ సిరీస్‌ను 3-0తో గెలవడం నిజంగా అద్భుతమైన ఘనత. అందులో నా తొలి టూర్‌లోనే ఈ స్థాయిలో రాణించడం నా కల నెరవేరినట్లుగా అనిపిస్తోంది" అని బ్రూక్ అన్నాడు.
పాకిస్థాన్‌లో తొలిసారి ఆడుతున్నా.. బ్రూక్ తనదైన పవర్ ప్లేతో పాక్ బౌలర్లను ఆటాడుకున్న్ఆడు. ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీతో చెలరేగాడు. రావల్పిండిలో జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (153)తోపాటు రెండో ఇన్నింగ్స్‌లో 87 రన్స్ చేశాడు. ఆ తర్వాత ముల్తాన్, కరాచీలలో జరిగిన టెస్టుల్లోనూ బ్రూక్ సెంచరీలు బాదాడు.
ఈ విధ్వంసకర బ్యాటింగ్‌తో పాకిస్థాన్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బ్రూక్ నిలిచాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అతడు ఏకంగా 93.60 సగటుతో 468 రన్స్ చేయడం విశేషం. అతని ఈ బ్యాటింగ్ చూసే ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ బ్రూక్‌ను ఏకంగా రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది.