SRH vs KKR: వాళ్లు ఓడించలేదు.. మేమే ఓడిపోయాం: ఎస్ఆర్‌హెచ్ కోచ్ లారా నిరాశ
SRH vs KKR: వాళ్లు ఓడించలేదు.. మేమే ఓడిపోయాం అంటూ ఎస్ఆర్‌హెచ్ కోచ్ లారా అనడం విశేషం. ఈ సీజన్ లో ఆరో ఓటమితో దాదాపు ప్లేఆఫ్స్ ఆశలు వదులుకున్న తరుణంలో లారా ఇలా నిర్వేదంతో మాట్లాడాడు.
SRH vs KKR: సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2023లో మరో మ్యాచ్ ఓడిపోయింది. ఆడిన 9 మ్యాచ్ లలో ఆరు ఓడి ప్లేఆఫ్స్ పై దాదాపు ఆశలు వదులుకుంది. ఈ నేపథ్యంలో ఆ టీమ్ హెడ్ కోచ్ బ్రియాన్ లారా తీవ్ర నిరాశ చెందాడు. కేకేఆర్ చేతుల్లో ఓడిన తర్వాత మాట్లాడుతూ.. వాళ్లు ఓడించలేదు.. మేమే ఓడిపోయాం అని లారా అనడం గమనార్హం.
పవర్ ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోవడం వల్లే తాము ఓడిపోయినట్లు అతడు చెప్పాడు. క్లాసెన్ పైనే తాము మొదటి నుంచీ భారం వేస్తున్నామని, ఈ మ్యాచ్ లోనే అతన్నే నమ్ముకున్నా ఫలితం లేకుండా పోయిందని అన్నాడు. గెలిచే మ్యాచ్ లో ఎస్ఆర్‌హెచ్ చేజేతులా ఓడిపోయింది. 5 పరుగులతో గెలిచిన కేకేఆర్.. ప్రతీకారం తీర్చుకుంది.
మ్యాచ్ తర్వాత లారా మాట్లాడుతూ.. "పవర్ ప్లేలో వికెట్లు కోల్పోతూనే ఉన్నాం. అది వెనకడుగు వేసేలా చేస్తుంది. ఈ సీజన్ లో అద్భుతంగా ఆడుతున్న క్లాసెన్ పైనే మరోసారి ఆధారపడ్డాం. అతని కంటే ముందు ఐదుగురు నాణ్యమైన బ్యాటర్లు ఉన్నారు. అయినా అతనిపైనే భారం పడుతోంది. భాగస్వామ్యాలకు మేము మరింత ప్రాముఖ్యత ఇవ్వాలి" అని లారా అన్నాడు.
ఇక కేకేఆర్ స్పిన్ ద్వయం సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిపైనా ప్రశంసలు కురిపించాడు. "సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు. స్పిన్ ఆడలేని బలహీనత అని చెప్పను. ఈ మ్యాచ్ గెలవాల్సింది. వాళ్లు మమ్మల్ని ఓడించలేదు. మేమే ఓడిపోయాం" అని లారా స్పష్టం చేశాడు.
మ్యాచ్ లో మార్‌క్రమ్, క్లాసెన్ మంచి భాగస్వామ్యం నెలకొల్పినా.. కీలకమైన సమయంలో మరోసారి వికెట్లు కోల్పోవడంతో ఓటమి తప్పలేదని లారా అన్నాడు. హ్యారీ బ్రూక్ వైఫల్యంపై స్పందిస్తూ.. నెట్స్ లో అతడు బాగానే శ్రమిస్తున్నాడని, అయితే ఎక్కడ తప్పు చేస్తున్నాడో తనకు తాను గమనించుకోవాలని సూచించాడు.
సంబంధిత కథనం