RCB vs KKR: సుడిగాలి ఇన్నింగ్స్‌తో కోల్‌కతాకు గ్రాండ్ విక్టరీ అందించిన శార్దూల్ ఠాకూర్
RCB vs KKR: ఐపీఎల్ 2023లో కోల్‌కతా తొలి విజయాన్ని అందుకుంది. గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 81 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది..
RCB vs KKR: బ్యాట్‌తో శార్దూల్, బాల్‌తో వరుణ్ చక్రవర్తి విజృంభించడంతో గురువారం బెంగళూరుపై కోల్‌కతా 81 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసింది. ఓపెనర్ గుర్భాజ్ (44 బాల్స్‌లో 3 సిక్సర్లు ఆరు ఫోర్లతో 57 రన్స్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫలం కావడంతో 89 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కోల్‌కతా కష్టాల్లో పడింది.
నైట్ రైడర్స్ 150 పరుగులైనా చేస్తుందా అని క్రికెట్ ఫ్యాన్స్ భావించారు. కానీ వారి అంచనాల్ని తలక్రిందులు చేస్తూ శార్దూల్ ఠాకూర్ మెరుపు ఇన్నింగ్స్‌తో కోల్‌కతాకు భారీ స్కోరు అందించాడు. 29 బాల్స్‌లోనే 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో శార్దూల్ 68 రన్స్ చేశాడు. అతడికి రింకు సింగ్(46 రన్) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి జోరుతో కోల్‌కతా 204 పరుగులు చేసింది.
బెంగళూరు బౌలర్లలో విల్లీ పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 205 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు 17. 4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కోహ్లి 21 రన్స్, డుప్లెసిస్ 23 రన్స్‌తో ధాటిగానే లక్ష్యఛేదనను ఆరంభించింది బెంగళూరు.
కానీ వీరి మెరుపులు ఎక్కువ సేపు కొనసాగలేదు. కోహ్లి, డుప్లెసిస్ ఔట్ కాగానే మిగిలిన బ్యాట్స్‌మెన్స్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివరి వికెట్‌కు విల్లీ, ఆకాష్‌దీప్ 27 పరుగులు జోడించడంతో బెంగళూరు కష్టంగా వంద పరుగులు దాటింది. కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లతో బెంగళూరును దెబ్బకొట్టాడు. సుయాష్ శర్మ, 3 వికెట్లు, సునీల్ నరైన్ 2 వికెట్లతో రాణించారు. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లో రాణించిన శార్దూల్ ఠాకూర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.