GT vs RR: సంజూ శాంసన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ - హెట్‌మేయర్ సిక్సర్ల వర్షం - గుజరాత్‌ను ఓడించిన రాజస్థాన్
GT vs RR: సంజూ శాంసన్, హెట్‌మేయర్ మెరుపులతో ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ మూడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.
GT vs RR: ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఈ పోరులో చివరకు గుజరాత్‌పై రాజస్థాన్ మూడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. సంజూ శాంసన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో పాటు చివరలో హెట్‌మేయర్ వరుస సిక్సర్లతో మెరుపులు మెరిపించి రాజస్థాన్‌కు విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (30 బాల్స్‌లో మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో 46 రన్స్), శుభ్‌మన్ గిల్ (34 బాల్స్‌లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్‌తో 45 రన్స్) బ్యాటింగ్‌లో రాణించారు. హార్దిక్ పాండ్య (28రన్స్), అభినవ్ మనోహర్(27 రన్స్) ఆకట్టుకోన్న భారీ స్కోర్లు చేయలేకపోయారు. గుజరాత్‌ను రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ కట్టడి చేశాడు. నాలుగు ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.
178 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో దేవ్‌దత్ ఫడిక్కల్‌తో కలిసి కెప్టెన్ సంజూ శాంసన్ రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 25 బాల్స్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 26 రన్స్ చేసి ఫడిక్కల్ ఔటయ్యాడు.
ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన హెట్‌మేయర్‌తో కలిసి రాజస్థాన్‌ను విజయం దిశగా శాంసన్ నడిపించాడు. ఇద్దరు సిక్సర్లతో గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. సంజూ శాంసన్ 32 బాల్స్‌లో ఆరు సిక్సర్లు, మూడు ఫోర్లతో 60 రన్స్ చేయగా హెట్‌మేయర్ 26 బాల్స్‌లో ఐదు సిక్సర్లు, రెండు ఫోర్లతో 56 రన్స్ చేశాడు.
విజయం ముగింట శాంసన్, ధృవ్ జురేల్ ఔట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ అశ్విన్ 3 బాల్స్‌లోనే ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో 10 రన్స్ చేసి రాజస్థాన్‌కు విజయాన్ని అందించాడు. గుజరాత్ బౌలర్లలో షమీ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.