IND vs SA 2nd T20: రెండో టీ20లో టీమ్ ఇండియా విజయం - డేవిడ్ మిల్లర్ సెంచరీ వృథా
IND vs SA 2nd T20: సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా 16 పరుగుల తేడాతో గెలిచింది . మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్నది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయర్స్ సూర్యకుమార్ యాదవ్, కె.ఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. లక్ష్యఛేదనలో డేవిడ్ మిల్లర్ సెంచరీతో రాణించినా సౌతాఫ్రికాను గెలిపించలేకపోయాడు.
IND vs SA 2nd T20:సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా 16పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. సూర్యకుమార్ యాదవ్, కె.ఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో మెరవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో పోరాడిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 221 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ సెంచరీ చేయగా డికాక్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఒక్క పరుగు వద్దే కెప్టెన్ బవుమా వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. పరుగుల ఖాతా తెరవకుండానే బవుమా పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత ఓవర్‌లోనే అర్షదీప్ బౌలింగ్‌లో రూసో ఔటయ్యాడు. మార్‌క్రామ్ ధాటిగా ఆడటంతో సౌతాఫ్రికా కోలుకున్నట్లుగానే కనిపించింది. 19 బాల్స్‌లో ఒక సిక్సర్ నాలుగు ఫోర్లతో 33 రన్స్ చేసిన మార్‌క్రమ్ ఔటయ్యాడు. మిల్లర్, డికాక్ కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. డికాక్ నెమ్మదిగా ఆడగా మిల్లర్ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో టీమ్ ఇండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 25 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 15వ ఓవర్ తర్వాత డికాక్ కూడా జోరు పెంచడంతో సౌతాఫ్రికా విజయం వైపు సాగింది. కానీ సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో డికాక్, మిల్లర్ మెరుపులు సరిపోలేదు.
అర్షదీప్ వేసిన 19వ ఓవర్‌లో 25 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో 37 పరుగులు చేయాల్సి ఉండగా అక్షర్ పటేల్ 20 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఈ ఓవర్‌లో మిల్లర్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 47 బాల్స్‌లో ఏడు సిక్సర్లు ఎనిమిది ఫోర్లతో 106 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. డికాక్ 48 బాల్స్‌లో నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 68 రన్స్ చేశాడు. సెకండ్ టీ20లో టీమ్ ఇండియా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. అర్షదీప్ రెండు వికెట్లు తీసినా భారీగా పరుగులిచ్చాడు. దీపక్ చాహర్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. అక్షర్ పటేల్‌కు ఒక్క వికెట్ దక్కింది.