Rinku Singh Bat: రింకు సింగ్ ఆ ఐదు సిక్స్‌లు కొట్టిన బ్యాట్ ఎవరిదో తెలుసా?
Rinku Singh Bat: రింకు సింగ్ ఆ ఐదు సిక్స్‌లు కొట్టిన బ్యాట్ ఎవరిదో తెలుసా? గుజరాత్ టైటన్స్ పై సంచలన ఇన్నింగ్స్ ఆడిన రింకు.. రాత్రికి రాత్రి హీరో అయిపోయిన విషయం తెలిసిందే.
Rinku Singh Bat: ఐపీఎల్ ఎందరో అనామకులను హీరోలను చేసింది. ఒక్క సంచలన ఇన్నింగ్స్ లేదా బౌలింగ్ తో రాత్రికి రాత్రి స్టార్లు అయిపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ లిస్టులో తాజాగా రింకు సింగ్ చేరాడు. ఈ కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ ఆదివారం (ఏప్రిల్ 9) గుజరాత్ టైటన్స్ పై ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
చివరి ఐదు బంతులకు ఐదు సిక్స్ లు కొట్టి అసాధ్యమనుకున్న విజయాన్ని కేకేఆర్ కు కట్టబెట్టాడు. అయితే ఈ మ్యాచ్ లో అతడు తన బ్యాట్ తో ఆడలేదు. ఆ బ్యాట్ కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణాది కావడం విశేషం. ఈ విషయాన్ని మ్యాచ్ తర్వాత నితీషే వెల్లడించాడు. నిజానికి ఆ బ్యాట్ ఇవ్వాలని తాను అనుకోలేదని, అయితే ఎవరో లోపలి నుంచి తెచ్చి అతనికి ఇచ్చారని నితీష్ చెప్పాడు.
"ఇది నా బ్యాట్. ఈ బ్యాట్ తోనే ఈ సీజన్ లో రెండు మ్యాచ్ లు ఆడాను. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మొత్తం ఇదే బ్యాట్ వాడాను" అని నితీష్ ఆ వీడియోలో చెప్పాడు. "ఇవాళే నా బ్యాట్ మార్చాను. రింకు నన్ను బ్యాట్ అడిగాడు. మొదట్లో ఈ బ్యాట్ అతనికి ఇవ్వకూడదని అనుకున్నాను. కానీ ఎవరో ఈ బ్యాట్ తీసుకొచ్చి ఇచ్చారు. ఈ బ్యాట్ కు మంచి స్ట్రోక్ ఉంది. దీంతో అతడు ఇదే బ్యాట్ తీసుకుంటాడని అనుకున్నాను. ఇప్పుడీ బ్యాట్ రింకూదే" అని నితీష్ అన్నాడు.
గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో కేకేఆర్ గెలవడానికి చివరి ఓవర్లో 29 పరుగులు అవసరమయ్యాయి. ఉమేష్ తొలి బంతికే సింగిల్ తీసి రింకుకి స్ట్రైక్ ఇచ్చాడు. యశ్ దయాల్ వేసిన ఆ ఓవర్ తర్వాతి ఐదు బంతులను రింకు సిక్స్ లుగా మలచి కేకేఆర్ కు ఊహించని విజయాన్ని సాధించి పెట్టాడు. రింకు చివరికి కేవలం 21 బంతుల్లోనే 48 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.
సంబంధిత కథనం