Kohli-Maxwell: మ్యాచ్‌లోనే రాక్ పేపర్ సిజర్స్ ఆడుతూ కనిపించిన కోహ్లి, మ్యాక్స్‌వెల్.. వీడియో వైరల్
Kohli-Maxwell: మ్యాచ్‌లోనే రాక్ పేపర్ సిజర్స్ ఆడుతూ కనిపించారు కోహ్లి, మ్యాక్స్‌వెల్. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓవైపు పంజాబ్ కింగ్స్ రివ్యూ తీసుకోగా.. మరోవైపు ఈ ఇద్దరూ ఇలా బిజీగా కనిపించారు.
Kohli-Maxwell: పైన ఉన్న ఫొటో చూశారు కదా. ఆర్సీబీ స్టాండిన్ కెప్టెన్ విరాట్ కోహ్లి, స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఏం చేస్తున్నారో అర్థమైందా? ఓవైపు పంజాబ్ కింగ్స్ రివ్యూ తీసుకొని ఆ టీమ్ ప్లేయర్స్ అంపైర్ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. ఈ ఇద్దరు మాత్రం అదేమీ పట్టనట్లు ఇలా రాక్ పేపర్ సిజర్స్ (rock paper scissors) ఆడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జితేష్ శర్మను అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ఔటిచ్చాడు. అయితే అతడు ఈ నిర్ణయాన్ని సవాలు చేశాడు. థర్డ్ అంపైర్ ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తుండగా.. జితేష్ చాలా కంగారుగా తుది నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ విరాట్, మ్యాక్సీ మాత్రం అసలు దానిని పట్టించుకోకుండా ఇలా రాక్ పేపర్ సిజర్స్ ఆడారు.
ఇది చూసిన చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశారు. ఈ మ్యాచ్ లో డుప్లెస్సి కేవలం బ్యాటింగ్ చేసి తప్పుకోవడంతో కెప్టెన్సీ అవకాశం కోహ్లికి దక్కింది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆర్సీబీ కెప్టెన్ గా వచ్చిన విరాట్..తనదైన స్టైల్లో ఫీల్డ్ లో చాలా దూకుడుగా కనిపించాడు. అయితే ఈ సందర్భంలో మాత్రం అతడు చాలా ప్రశాంతంగా మ్యాక్సీతో సరదాగా ఈ గేమ్ ఆడుతూ కనిపించడం విశేషం.
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 24 పరుగులతో గెలిచింది. కోహ్లి, డుప్లెస్సి హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 174 రన్స్ చేయగా.. తర్వాత పంజాబ్ కింగ్స్ 150 పరుగులకే పరిమితమైంది. సిరాజ్ 4 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ తో డుప్లెస్సి ఆరెంజ్ క్యాప్ లిస్టులో టాప్ లోకి దూసుకెళ్లగా.. సిరాజ్ పర్పుల్ క్యాప్ లీడర్ అయ్యాడు.
సంబంధిత కథనం