IPL 2023 Final weather forecast: చెన్నై-గుజరాత్ ఫైనల్ మ్యాచ్‌కు వరణుడు అడ్డంకి..!-csk vs gt weather forecast rain expected in ahmedabad ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Final Weather Forecast: చెన్నై-గుజరాత్ ఫైనల్ మ్యాచ్‌కు వరణుడు అడ్డంకి..!

IPL 2023 Final weather forecast: చెన్నై-గుజరాత్ ఫైనల్ మ్యాచ్‌కు వరణుడు అడ్డంకి..!

Maragani Govardhan HT Telugu
May 27, 2023 10:04 PM IST

IPL 2023 Final weather forecast: చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం నాడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ గేమ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశముంది. అహ్మదాబాద్‌లో 40 శాతం వర్ష కురిసే అవకాశముంది.

చెన్నై-గుజరాత్ మ్యాచ్‌కు వరణుడు అడ్డంకి
చెన్నై-గుజరాత్ మ్యాచ్‌కు వరణుడు అడ్డంకి (ANI )

IPL 2023 Final weather forecast: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే 10వ సారి ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. మరోపక్క గుజరాత్ టైటాన్స్ కూడా క్వాలిఫయర్-2లో ముంబయి ఇండియన్స్‌ను మట్టి కరిపించి పైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. దీంతో ఇరు జట్లు గెలుపు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. చెన్నై ఐదో సారి ఐపీఎల్ టైటిల్ ముద్దాడాలని భావిస్తుండగా.. గుజరాత్ టైటాన్స్ జట్టు రెండో సారి టైటిల్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. దీంతో మ్యాచ్ ఆసక్తి నెలకొంది. ఈ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడించి మంచి జోరు మీద ఉంది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ముంబయి-గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌కు కూడా వరణుడు అడ్డంకిగా మారాడు. ఫలితంగా 45 నిమిషాల పాటు టాస్‌కు ఆలస్యమైంది. చివరకు 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. తేమ కారణంగా బౌలర్లపై ఇది కాస్త ఒత్తిడిని పెంచింది.

ఫైనల్ మ్యాచ్‌కు వాతావరణ రిపోర్ట్..

యూక్యూవెథర్ రిపోర్టు ప్రకారం అహ్మదాబాద్‌లో ఆదివారం నాడు సాయంత్రం 40 శాతం వర్షం కురిసే అవకాశముంది. ఈ నగరంలో మొత్తం 2 గంటల పాటు వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా సాయంత్రం నాటికి గాలి వేగం గంటకు 50 కిలోమీటర్ల వరకు వీస్తుందని పేర్కొంది.

భారత వాతావరణ శాఖ రిపోర్టు ప్రకారం ఆదివారం నాడు భారీగా వర్షం కురిసే అవకాశం లేదు. అయితే వాతావరణం చాలా వరకు మేఘావృతమై ఉంటుందని, కొద్దిపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అహ్మదాబాద్‌లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని అంచనా వేయడంతో, బంతి ప్రారంభంలో కొద్దిగా కదులుతుందని భావిస్తున్నారు. ముంబయితో మ్యాచ్‌లోనూ ఆట సాగుతున్న కొద్ది బ్యాటింగ్ పరిస్థితులు మెరుగయ్యాయి.

ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే ఏమవుతుంది?

ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా నిర్వహించడం కుదరకపోతే గత సీజన్‌లో రిజర్వ్ డేకు అవకాశమిచ్చారు. అయితే ఐపీఎల్ 2023లో మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే పరిస్థితులు ఏర్పడితే కనీసం ఇరు వైపులా ఐదు ఓవర్లను నిర్వహించవచ్చు. అది సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ కూడా నిర్వహించవచ్చు. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే స్థితికి వస్తే మాత్రం.. అప్పుడే లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు తెచ్చుకున్న జట్టును విజేతగా ప్రకటిస్తారు.

WhatsApp channel