Bravo on Dhoni: ధోనీ వచ్చే ఏడాదీ ఆడతాడు.. ఆ రూల్ వల్ల అతని కెరీర్ మరింత పెరుగుతుంది: బ్రావో
Bravo on Dhoni: ధోనీ వచ్చే ఏడాదీ ఆడతాడని స్పష్టం చేశాడు డ్వేన్ బ్రావో. అతనికిదే చివరి ఐపీఎల్ సీజన్ అన్న ఊహాగానాల నేపథ్యంలో బ్రావో చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.
Bravo on Dhoni: ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో. అతడు వచ్చే ఏడాది కూడా కచ్చితంగా ఎల్లో జెర్సీలో కనిపిస్తాడని స్పష్టం చేశాడు. మంగళవారం (మే 23) గుజరాత్ టైటన్స్ తో జరిగిన తొలి క్వాలిఫయర్ లో విజయం సాధించి 10వసారి ఐపీఎల్ ఫైనల్ చేరిన తర్వాత బ్రావో ఈ విషయం చెప్పడం విశేషం.
ధోనీ ప్లేయర్ గానే తిరిగి వస్తాడని, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అతని కెరీర్ ను మరింత పెంచనుందని బ్రావో అన్నాడు. "వంద శాతం. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కారణంగా అతని కెరీర్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది" అని బ్రావో స్పష్టం చేశాడు. "అతడు చివర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. అజింక్య రహానే, శివమ్ దూబె జట్టుపై చాలా ప్రభావం చూపిస్తున్నారు. ఎమ్మెస్ నుంచి పెద్దగా బ్యాటింగ్ అవసరం రాదాు. కానీ జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు మాత్రం ధోనీ ప్రశాంతంగా తన పని తాను చేయగలడు" అని బ్రావో అన్నాడు.
నిజానికి ధోనీ కూడా తన రిటైర్మెంట్ పై సస్పెన్స్ కొనసాగిస్తున్నాడు. గతేడాది మాత్రం 2023 ఐపీఎల్లే తన చివరి సీజన్ అని దాదాపు ఖాయం చేసిన అతడు.. ఈసారి మాత్రం మాట మార్చాడు. గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ తర్వాత కూడా ఇదే ప్రశ్నను ధోనీని అడిగితే.. దానికి అతడు స్పష్టమైన సమధానం ఇవ్వలేదు.
"నిజం చెప్పాలంటే చాలా భారం పడుతోంది. నాలుగు నెలలుగా నేను ఇంటికి దూరంగా ఉన్నాను. నేనెప్పుడైనా సీఎస్కేకు తిరిగి వస్తాను. జనవరి నుంచి నేను నా ఇంటికి దూరంగా ఉన్నాను. మార్చి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో" అని ధోనీ అన్నాడు.
"నేను జనవరి 31న ఇంటి నుంచి బయటకు వచ్చాను. నా పని పూర్తి చేసుకున్న తర్వాత మార్చి 2 లేదా 3 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు నిర్ణయం తీసుకోవడానికి చాలా టైమ్ ఉంది. 8, 9 నెలల సమయం ఉంది. ఇప్పుడే దాని గురించి ఆలోచించడం ఎందుకు? వేలం డిసెంబర్ లో ఉంది" అని ధోనీ చెప్పడం విశేషం.
సంబంధిత కథనం