ICC Test Rankings: ఆస్ట్రేలియా బ్యాటర్ల హవా.. టాప్ 3 ర్యాంకులూ వాళ్లవే
ICC Test Rankings: ఆస్ట్రేలియా బ్యాటర్ల హవా కొనసాగింది. లేటెస్ట్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ 3 ర్యాంకులూ వాళ్లవే కావడం విశేషం. డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా బ్యాటర్లు ర్యాంకుల్లో పైకి దూసుకెళ్లారు.
ICC Test Rankings: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియాను ఓడించి విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. ఇటు టెస్టు ర్యాంకుల్లోనూ సత్తా చాటింది. ఆ జట్టుకు చెందిన బ్యాటర్లే టాప్ 3లో ఉండటం విశేషం. లబుషేన్, స్మిత్, హెడ్ తొలి మూడు ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఫైనల్లో ఇండియాపై హెడ్ సెంచరీ చేయడంతో అతడు మూడోస్థానానికి దూసుకొచ్చాడు.
లబుషేన్ తొలి ర్యాంకులో కొనసాగుతుండగా.. స్టీవ్ స్మిత్ రెండో ర్యాంకులో ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఏకంగా 209 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫైనల్లో హెడ్, స్మిత్ సెంచరీలు చేశారు. తొలి ఇన్నింగ్స్ లో ధాటిగా ఆడిన హెడ్ 174 బంతుల్లోనే 163 పరుగులు చేశాడు. మరోవైపు స్మిత్ కూడా ఇండియాపై తన 9వ సెంచరీ నమోదు చేశాడు.
స్మిత్ 168 బంతుల్లో 121 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి ఫైటింగ్ ఇన్నింగ్స్ తో తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగుల భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా.. మ్యాచ్ పై పట్టుబిగించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో స్మిత్, హెడ్ విఫలమైనా.. లబుషేన్ 41 పరుగులతో రాణించాడు. దీంతో ఈ ముగ్గురూ లేటెస్ట్ ర్యాంకుల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
ఫైనల్లో హెడ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. లబుషేన్ 903 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. స్మిత్ 885 పాయింట్లతో రెండోస్థానానికి వెళ్లాడు. ఇక హెడ్ 884 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. ఇన్నాళ్లూ రెండోస్థానంలో ఉన్న కేన్ విలియమ్సన్ నాలుగోస్థానానికి పడిపోయాడు. ప్రమాదానికి గురై చాన్నాళ్లుగా క్రికెట్ కు దూరంగా ఉన్నా కూడా రిషబ్ పంత్ టాప్ 10లో కొనసాగుతుండటం విశేషం.
సంబంధిత కథనం