ICC Rankings: బాబర్‌ ఆజంను మించిపోయిన సూర్యకుమార్‌-icc rankings released as suryakumar yadav overtakes babar azam ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Icc Rankings Released As Suryakumar Yadav Overtakes Babar Azam

ICC Rankings: బాబర్‌ ఆజంను మించిపోయిన సూర్యకుమార్‌

Hari Prasad S HT Telugu
Sep 21, 2022 04:15 PM IST

ICC Rankings: బాబర్‌ ఆజంను మించిపోయాడు టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్. బుధవారం (సెప్టెంబర్‌ 21) రిలీజ్‌ చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో అతడు మూడోస్థానానికి చేరుకున్నాడు.

టీ20 ర్యాంకుల్లో బాబర్ ఆజంను వెనక్కి నెట్టిన సూర్యకుమార్ యాదవ్
టీ20 ర్యాంకుల్లో బాబర్ ఆజంను వెనక్కి నెట్టిన సూర్యకుమార్ యాదవ్ (BCCI Twitter)

ICC Rankings: కొంతకాలంగా టీమిండియాలో నిలకడగా ఆడుతున్న స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ సూర్య మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో టీ20 ర్యాంకుల్లో పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్ ఆజంను వెనక్కి నెట్టి మూడోస్థానానికి చేరుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

ఈ మ్యాచ్‌లో సూర్య 25 బాల్స్‌లోనే 46 రన్స్‌ చేశాడు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో కేవలం 30 బాల్స్‌లోనే 71 రన్స్‌ చెలరేగిపోయిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కూడా తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 22 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం అతడు 65వ స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్ల లిస్ట్‌లోనూ ఆస్ట్రేలియా ప్లేయర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను వెనక్కి నెట్టి పాండ్యా ఐదో స్థానానికి చేరుకున్నాడు.

ఇక ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 17 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు తీసిన స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ కూడా 57వ ర్యాంక్‌ నుంచి 33వ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. ఇక ఇండియాతో మ్యాచ్‌లో 30 బాల్స్‌లో 61 రన్స్‌ బాది మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఓపెనర్‌ కామెరాన్‌ గ్రీన్‌.. తొలిసారి టాప్‌ 100లోకి వచ్చాడు. అటు బౌలర్ల లిస్ట్‌లో ఆస్ట్రేలియా బౌలర్‌ హేజిల్‌వుడ్‌ టాప్‌లో కొనసాగుతున్నాడు.

అటు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 68 రన్స్‌ చేసిన పాకిస్థాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ తన టాప్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అంతేకాదు ఈ ఇన్నింగ్స్‌తో 15 రేటింగ్ పాయింట్స్‌ అతని సొంతమయ్యాయి. ప్రస్తుతం రిజ్వాన్‌ 825 రేటింగ్‌ పాయింట్స్‌తో టాప్‌లోనే ఉన్నాడు. రెండోస్థానంలో సౌతాఫ్రికా బ్యాటర్ ఏడెన్‌ మార్‌క్రమ్‌ ఉన్నాడు.

ఇక ఒకే రోజు జరిగిన ఈ రెండు టీ20 మ్యాచ్‌లలో హోమ్‌ టీమ్స్‌ ఇండియా, పాకిస్థాన్‌లను ఓడించి విజేతలుగా నిలిచాయి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌. ఇటు 209 రన్స్‌ భారీ టార్గెట్‌ను ఈజీగా చేజ్‌ చేసిన ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లగా.. అటు ఇంగ్లండ్‌ 159 రన్స్‌ టార్గెట్‌ను 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఏడు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ 1-0 ఆధిక్యంలో ఉంది.

WhatsApp channel