Hardik Pandya on comeback: అప్పుడు స్ట్రెచర్‌పై అలా.. ఇప్పుడు పాకిస్థాన్‌పై ఇలా.. హార్దిక్‌ ఫొటో వైరల్‌-hardik pandya shared an inspiring photo in his twitter after winning the match against pakistan ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Hardik Pandya Shared An Inspiring Photo In His Twitter After Winning The Match Against Pakistan

Hardik Pandya on comeback: అప్పుడు స్ట్రెచర్‌పై అలా.. ఇప్పుడు పాకిస్థాన్‌పై ఇలా.. హార్దిక్‌ ఫొటో వైరల్‌

Hari Prasad S HT Telugu
Aug 29, 2022 05:02 PM IST

Hardik Pandya on comeback: అప్పుడు స్ట్రెచర్‌పై.. ఇప్పుడు పాకిస్థాన్‌పై మ్యాచ్‌ గెలిచిన తర్వాత ఫొటోలను హార్దిక్‌ పాండ్యా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకున్నాడు. దీనికి అతడు ఉంచిన క్యాప్షన్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా (AP)

Hardik Pandya on comeback: ఇండియన్‌ క్రికెట్‌లో హార్దిక్‌ పాండ్యా పడి లేచిన విధానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. గతేడాది గాయంతో టీమ్‌కు దూరమైన తర్వాత, అతని స్థానంలో వచ్చిన వాళ్లు రాణిస్తున్న వేళ.. మళ్లీ హార్దిక్‌ టీమ్‌లోకి వస్తాడా, వచ్చినా మునుపటి స్థాయిలో ఆడతాడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చిన అతడు.. ఆ సందేహాలను పటాపంచలు చేశాడు.

గుజరాత్‌ టైటన్స్‌ కెప్టెన్‌గా ఆ టీమ్‌ను విజేతగా నిలపడంతోపాటు తిరిగి బౌలింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. అదే ఇండియన్‌ టీమ్‌లో మళ్లీ అతనికి స్థానం దక్కేలా చేసింది. వచ్చిన ఈ అవకాశాన్ని అతడు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. తాజాగా ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో అటు బాల్‌తో, ఇటు బ్యాట్‌తో విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివరి ఓవర్లో సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించి హీరోగా నిలిచాడు.

అయితే మ్యాచ్‌ తర్వాత సోమవారం (ఆగస్ట్‌ 29) తన ట్విటర్‌లో హార్దిక్‌ షేర్‌ చేసిన ఫొటో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇందులో ఒకప్పుడు వెన్ను గాయానికి గురై ఫీల్డ్‌ నుంచి నడిచి వెళ్లే పరిస్థితి లేక స్ట్రెచర్‌పై మోసుకెళ్తున్న ఫొటో ఒకటి కాగా.. మరొకటి పాకిస్థాన్‌పై టీమ్‌ను గెలిపించిన తర్వాత సగర్వంగా బ్యాట్‌తో అభివాదం చేస్తున్న ఫొటో. అంతేకాదు దీనికి అతడు పెట్టిన క్యాప్షన్‌ మరింత స్ఫూర్తిదాయకంగా ఉంది.

"కమ్‌బ్యాక్‌ ఈజ్‌ గ్రేటర్‌ దాన్‌ సెట్‌బ్యాక్‌ (ఎదురు దెబ్బ కంటే తిరిగి రావడం గొప్ప)" అంటూ హార్దిక్‌ ఈ రెండు ఫొటోలను షేర్‌ చేశాడు. ఇప్పుడీ పోస్ట్ వైరల్‌ అవుతోంది. నిజంగా కెరీర్‌ను భయపెట్టిన గాయం నుంచి కోలుకొని మళ్లీ మునుపటి కంటే మెరుగ్గా రాణిస్తున్న తీరు అద్బుతమనే చెప్పాలి. అంతేకాదు 2018 ఆసియాకప్‌ సందర్భంగా ఇదే దుబాయ్‌లోనే హార్దిక్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

ఆ తర్వాత అతన్ని స్ట్రెచర్‌పై అలా బయటకు మోసుకెళ్లారు. అప్పుడు హార్దిక్‌ను చూసిన వాళ్లు తిరిగి క్రికెట్‌ ఆడతాడా? ఒకవేళ ఆడినా బౌలింగ్‌ చేయగలడా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అటు ఈ గాయం గురించి హార్దిక్‌ మాట్లాడిన వీడియోను బీసీసీఐ కూడా ట్విటర్‌లో షేర్‌ చేసింది.

WhatsApp channel

సంబంధిత కథనం