Suryakumar on his shots: అలా ప్రాక్టీస్ చేసేవాడిని కాబట్టే ఇలాంటి షాట్లు ఆడగలను: సూర్యకుమార్
Suryakumar on his shots: ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తన 360 డిగ్రీ షాట్లతో అలరించిన విషయం తెలుసు కదా. దీనిపై మ్యాచ్ తర్వాత అతడు స్పందించాడు.
Suryakumar on his shots: సూర్యకుమార్ యాదవ్.. రోజులు గడుస్తున్న కొద్దీ ఇండియన్ క్రికెట్‌లో ఈ పేరు క్రమంగా ఓ బ్రాండ్‌గా మారే రేంజ్‌కు వెళ్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలాంటి ప్లేయర్స్‌కు సమానంగా పాపులారిటీని సంపాదించుకుంటున్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తూ అసలు భయం లేని క్రికెట్ ఆడుతూ అలరిస్తున్నాడు.
తాజాగా ఆసియా కప్ లో భాగంగా హాంకాంగ్‌తో మ్యాచ్‌లో అయితే విశ్వరూపం చూపించాడు. 360 డిగ్రీ ఆటతో గ్రౌండ్ నలుమూలలా అతడు ఆడిన షాట్లు విరాట్ కోహ్లిని కూడా షాక్‌కు గురి చేశాయి. చివరికి కోహ్లి కూడా వంగి వంగి దండాలు పెట్టడం విశేషం. ఈ మ్యాచ్‌లో సూర్య కేవలం 26 బాల్స్‌లోనే 6 సిక్స్‌లు, 6 ఫోర్లతో 68 రన్స్ చేయడం విశేషం. హరూన్ అర్షద్ వేసిన చివరి ఓవర్లోనే అతడు నాలుగు సిక్స్‌లు బాదాడు.
ఇది కూడా చదవండి | Virat Kohli Reaction: ఏం ఆట ఇది.. సూర్య హిట్టింగ్‌పై విరాట్ కోహ్లి ఫిదా
కేవలం 22 బాల్స్‌లోనే అతడు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన ఈ ఆటతీరు, ఎంపిక చేసుకున్న షాట్ల గురించి మ్యాచ్ తర్వాత అతడు స్పందించాడు. "ఈ మ్యాచ్‌లో ఆడిన షాట్లను నేనెప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు. కానీ నా చిన్నతనంలో ఫ్రెండ్స్‌తో క్రికెట్ ఆడే సమయంలో సిమెంట్ రోడ్లపై రబ్బర్ బాల్‌తో ఆడేవాడిని. అక్కడి నుంచే ఇలాంటి షాట్లు వచ్చాయి" అని సూర్యకుమార్ చెప్పడం విశేషం.
అయితే తాను బ్యాటింగ్‌కు వచ్చే ముందే రోహిత్, రిషబ్ పంత్‌లకు ఇలా ఆడతానని చెప్పి మరీ వచ్చినట్లు సూర్య వెల్లడించాడు. "పిచ్ మొదట్లో కాస్త నెమ్మదిగా ఉంది. అయితే నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు కాస్త వేగంగా ఆడతానని రోహిత్, రిషబ్‌లతో మాట్లాడినప్పుడు చెప్పాను. 170-175 స్కోరు లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ అంతకు మించి స్కోరు సాధించాం. ఈ పిచ్‌పై ఇది మంచి స్కోరు" అని ఇన్నింగ్స్ బ్రేక్‌లో సూర్య చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో హాంకాంగ్‌ను 40 రన్స్‌తో ఇండియా ఓడించింది. వరుసగా రెండు విజయాలతో గ్రూప్ ఎ నుంచి సూపర్ ఫోర్‌కు అర్హత సాధించింది. గ్రూప్ బి నుంచి ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్ క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. హాంకాంగ్, పాకిస్థాన్ మ్యాచ్ విజేత గ్రూప్ ఎ నుంచి సూపర్ ఫోర్‌కు క్వాలిఫై అవుతుంది.