ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్.. దూసుకెళ్లిన కోహ్లి
ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లి కూడా ఈ తాజా ర్యాంకుల్లో పైకి దూసుకెళ్లాడు. ఐసీసీ బుధవారం (ఏప్రిల్ 5) ఈ ర్యాంకులు రిలీజ్ చేసింది.

ICC ODI Rankings: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన ఇంటర్నేషనల్ ఫామ్ ను ఐపీఎల్లోనూ కొనసాగిస్తున్న విషయం తెలుసు కదా. అయితే తాజాగా ఐసీసీ బుధవారం (ఏప్రిల్ 5) రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ లోనూ గిల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. అతడు 738 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. మూడోస్థానంలో ఉన్న పాక్ బ్యాటర్ ఇమాముల్ హక్ కంటే కేవలం రెండు పాయింట్లు వెనుకబడ్డాడు.
ఇప్పటి వరకూ నాలుగోస్థానంలో ఉన్న క్వింటన్ డికాక్ తాజా ర్యాంకుల్లో ఏడోస్థానానికి పడిపోయాడు. మరోవైపు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఈ మధ్యే ముగిసిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్ లో గిల్ మూడు వన్డేల్లో కేవలం 57 పరుగులు మాత్రమే చేశాడు. అయితే గతేడాది అతడు టాప్ ఫామ్ లో ఉన్నాడు. ఒకే కేలండర్ ఏడాదిలో వన్డేలలో మూడు సెంచరీలు చేశాడు.
అటు కోహ్లి కూడా ఈ ఏడాది వన్డేలలో రెండు సెంచరీలు సహా 427 రన్స్ చేశాడు. దీంతో తాజా ర్యాంకుల్లో అతడు ఆరో స్థానానికి చేరుకున్నాడు. అటు కెప్టెన్ రోహిత్ శర్మ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తంగా టాప్ 10లో ముగ్గురు ఇండియన్ బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్ ర్యాంకులు పరిశీలిస్తే మహ్మద్ సిరాజ్ మూడోస్థానంలోనే ఉన్నాడు.
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ తొలి రెండు ర్యాంకుల్లో ఉన్నారు. బ్యాటింగ్ ర్యాంకుల్లో బాబర్ ఆజం 887 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా బ్యాటర్ రాసీ వాండెర్ డసెన్ 777 పాయింట్లతో రెండోస్థానంలో, ఇమాముల్ హక్ 740 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నారు. ఐదోస్థానంలో క్వింటన్ డికాక్ ఉన్నాడు.
సంబంధిత కథనం