Sehwag on Prithvi Shaw: శుభ్‌మన్ గిల్‌ను చూసి నేర్చుకో.. పృథ్వీ షాకు క్లాస్ పీకిన సెహ్వాగ్
Sehwag on Prithvi Shaw: శుభ్‌మన్ గిల్‌ను చూసి నేర్చుకో అంటూ పృథ్వీ షాకు క్లాస్ పీకాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. తనకు వచ్చిన అవకాశాలను అతడు పదే పదే చేజార్చుకుంటుండటంపై వీరూ సీరియర్ అయ్యాడు.
Sehwag on Prithvi Shaw: పృథ్వీ షా అప్పుడెప్పులో 2018లో ఇండియన్ టీమ్ లోకి తొలిసారి వచ్చాడు. వచ్చీ రాగానే తొలి టెస్టులోనే సెంచరీ కొట్టాడు. అతన్ని చూసి అప్పటి కోచ్ రవిశాస్త్రి తెగ పొంగిపోయాడు. అతనిలో సెహ్వాగ్, లారా, టెండూల్కర్ ఉన్నాడని కొనియాడాడు. తీరా ఇప్పుడు చూస్తే.. మళ్లీ టీమిండియాలోకి రావడానికి కిందామీదా పడుతున్నాడు.
పృథ్వీ షాలోని దూకుడైన ఆట అలాగే ఉన్నా.. అతడు పదేపదే అదే తప్పులు చేయడంపై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ సీరియస్ అయ్యాడు. శుభ్‌మన్ గిల్ ను చూసి నేర్చుకో అంటూ షాపై మండిపడ్డాడు. మంగళవారం (ఏప్రిల్ 4) గుజరాత్ తో మ్యాచ్ లో షా ఔటైన తీరుపై వీరూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే అతడు ఇలా చాలాసార్లు ఔటయ్యాడని అన్నాడు.
"ఇలాంటి షాట్లు ఆడి అతడు చాలాసార్లు వికెట్ పారేసుకున్నాడు. అతడు తన తప్పుల నుంచి నేర్చుకోవాలి కదా. శుభ్‌మన్ గిల్ ను చూడండి. పృథ్వీ షాతో కలిసి అండర్ 19 క్రికెట్ ఆడాడు. ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో ఇండియాకు ఆడుతున్నాడు. కానీ షా మాత్రం ఇప్పటికీ ఐపీఎల్లోనే ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఐపీఎల్ ను సద్వినియోగం చేసుకొని భారీగా పరుగులు చేయాలి. రుతురాజ్ గైక్వాడ్ 600కుపైగా రన్స్ చేశాడు. గిల్ కూడా అంతే. షా కూడా ఐపీఎల్లో నిలకడగా ఆడాలి" అని సెహ్వాగ్ అన్నాడు.
ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ లలో పృథ్వీ షా విఫలమయ్యాడు. కేవలం 7, 12 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మధ్యే పృథ్వీ షాను న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు ఎంపిక చేసినా.. అతనికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.
సంబంధిత కథనం