Sarfaraz Ahmed on India: టీమిండియా ముందు మేము బచ్చాగాళ్లం.. అయినా వాళ్లను ఓడించాం: పాక్ మాజీ కెప్టెన్-sarfaraz ahmed on india remembers 2017 champions trophy final
Telugu News  /  Sports  /  Sarfaraz Ahmed On India Remembers 2017 Champions Trophy Final
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియాను ఓడించిన పాకిస్థాన్
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియాను ఓడించిన పాకిస్థాన్ (Getty Images)

Sarfaraz Ahmed on India: టీమిండియా ముందు మేము బచ్చాగాళ్లం.. అయినా వాళ్లను ఓడించాం: పాక్ మాజీ కెప్టెన్

30 March 2023, 16:51 ISTHari Prasad S
30 March 2023, 16:51 IST

Sarfaraz Ahmed on India: టీమిండియా ముందు మేము బచ్చాగాళ్లం.. అయినా వాళ్లను ఓడించాం అంటూ పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గురించి అతడు మాట్లాడాడు.

Sarfaraz Ahmed on India: ఐసీసీ టోర్నీ అంటే చాలు పాకిస్థాన్ ను చిత్తుగా ఓడిస్తుంది టీమిండియా. కానీ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మాత్రం రివర్సయింది. ఈ మ్యాచ్ లో పాక్ చారిత్రక విజయం సాధించింది. లీగ్ స్టేజ్ లో ఇండియా చేతుల్లో ఓడి, టోర్నీ నుంచి వెళ్లిపోవడం ఖాయమన్న స్థితి నుంచి ఆ టీమ్ కోలుకొని ఫైనల్లో అదే ఇండియాను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది పాకిస్థాన్.

అప్పట్లో కెప్టెన్ గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్థాన్ లో రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు. అయితే ఆరేళ్ల తర్వాత ఇప్పుడా ఫైనల్ మ్యాచ్ గురించి మరోసారి గుర్తు చేసుకున్నాడతడు. ఇండియన్ టీమ్ లో దిగ్గజ ప్లేయర్స్ ఉన్నారని, తమ టీమ్ లో మాత్రం ఇంకా పాల దంతాలు కూడా ఊడిపోని ప్లేయర్స్ ఉన్నా తామే గెలిచామని అతడు అనడం గమనార్హం.

"ఆ విజయాన్ని ఎప్పటికీ మరచిపోలేం. ఇండియాపై ఫైనల్ గెలవడాన్ని మాటల్లో వర్ణించలేం. అది సాధారణ మ్యాచ్ అయి ఉంటే పెద్దగా పట్టించుకునే వాళ్లం కాదు. అంతకుముందు కూడా ఇండియాను ఓడించాం. నిజానికి మేమే ఎక్కువగా గెలిచాం. కానీ ఎలాంటి టార్గెట్ అయినా ఛేదించగలిగే సత్తా ఉన్న ఈ ఇండియన్ టీమ్ ను ఓడించడం మాత్రం అద్భుతం" అని నదీర్ అలీ పాడ్‌కాస్ట్ లో మాట్లాడుతూ సర్ఫరాజ్ అన్నాడు.

"ఎంత పెద్ద టార్గెట్ అయినా వాళ్లకు సరిపోదు. ఇండియాలో ధోనీ, రోహిత్, ధావన్, యువరాజ్, కోహ్లిలాంటి వాళ్లు ఉన్నారు. కానీ మా దగ్గర మాత్రం ఇంకా పాల దంతాలు కూడా ఊడని వాళ్లు ఉన్నారు. అప్పుడు మా దగ్గర యువకులు ఉన్నారు. వాళ్లే ఇప్పుడు పాక్ క్రికెట్ ను ఓ స్థాయికి తీసుకెళ్తున్నారు. బాబర్ ఆజం, హసన్ అలీ, షాదాబ్ ఖాన్ అప్పుడు యువ ఆటగాళ్లు. అసలు టీమిండియాతో మాకు పోలికే లేదు. కేవలం హఫీజ్, షోయబ్ మాలిక్ మాత్రమే సీనియర్లు" అని సర్ఫరాజ్ చెప్పాడు.

ఆ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లోనే ఇండియా చేతిలో 124 పరుగుల తేడాతో పాక్ ఓడిపోయింది. అయినా తర్వాత అద్భుతంగా పుంజుకొని ఫైనల్ చేరడమే కాదు.. అక్కడ ఇండియాను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. ఫైనల్ కు ముందు తాము 100 శాతం ప్రదర్శన కనబరిస్తే ఇండియాను ఓడించవచ్చని తాను ప్లేయర్స్ తో చెప్పినట్లు సర్ఫరాజ్ గుర్తు చేసుకున్నాడు.

సంబంధిత కథనం