Ego Clashes In Team India: టీమిండియాలో ఇగోలు ఉన్నాయి.. కోహ్లీ-రోహిత్ గురించి మాట్లాడను.. ధావన్ షాకింగ్ కామెంట్స్
Ego Clashes In Team India: టీమిండియాలో ఇగోలు ఉన్నాయని ధావన్ స్పష్టం చేశాడు. ఇగోలు ఉండటమనేది మానవనైజమని తెలిపాడు. అయితే కోహ్లీ, రోహిత్ గురించి మాట్లాడేందుకు మాత్రం నిరాకరించాడు.
Ego Clashes In Team India: క్రికెట్‌ను మనదేశంలో ఎంతలా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫలితంగా పెద్ద స్టార్ క్రికెటర్ల అంతా వెలుగులోకి వచ్చారు. ఒకప్పుడు సచిన్ తెందూల్కర్ మొదలు ఎంఎస్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి స్టార్ ఆటగాళ్లు క్రికెట్‌ను శాసించారు. ప్రస్తుతం వీరి దారిలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవిచందన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఎప్పటి నుంచో టీమిండియాలో ఓ పుకారు హల్చల్ చేస్తోంది. భారత జట్టులో ఆటగాళ్లకు మధ్య ఇగోలు ఉన్నాయని, ఒకరికొకరి మధ్య ఈర్ష్య ద్వేషాలు నెలకొన్నాయని ఊహాగానాలు బయటకొస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ స్పందించాడు. జట్టులో ఇగోలు ఉన్నాయని ఖరారు చేశాడు.
"ఇగోలు ఉండటం మానవ నైజం. ఇది చాలా సాధారణమైన విషయం. ఏడాదిలో 220 రోజుల పాటు మేమంతా కలిసే ఉంటాం. అలాంటప్పుడు వ్యక్తుల మధ్య అభిప్రాయభేదాలు రావడం సహజం. అదే విధంగా భారత జట్టులోనూ ఉంది. నేను రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడట్లేదు. సాధారణంగా ఎవరి మధ్యనైన ఇగోలు ఉంటాయి." అని ధావన్ అన్నాడు.
ఈ విషయంలో రోహిత్, కోహ్లీ గురించి మాట్లాడేందుకు ధావన్ నిరాకరించాడు. అయితే ఎక్కువ మంది ఓ సమూహంగా ఉన్నప్పుడు ఇగోలు ఉంటాయని తెలిపాడు.
"మాది 40 మంది సభ్యుల బృందం. ఇందులో సహాయక సిబ్బంది, ఇతర నిర్వాహకులు ఉంటారు. మీకు ఎవరితోనైనా పడకపోతే కొన్ని ఘర్షణలు, క్లిష్ట పరిస్థితులు ఉండవచ్చు. అది సహజంగా జరుగుతుంది. అలాగే పరిస్థితులు మెరుగుపడినప్పుడు ప్రేమ కూడా పెరుగుతుంది" అని ధావన్ తెలిపాడు.
వన్డే జట్టులో తన స్థానంలో శుబ్‌మన్ గిల్‌ను తీసుకోవడంపై కూడా ధావన్ స్పందించాడు. తాను సెలెక్టర్‌ను అయినట్లయితే శుభ్‌మన్‌గిల్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేస్తానని అన్నాడు. టెస్ట్‌లతో పాటు టీ20లలో శుభ్‌మన్ చక్కగా రాణిస్తున్నాడని ధావన్ పేర్కొన్నాడు. కానీ అతడికి సరైన అవకాశాలు రావడం లేదని తెలిపాడు. ఇంటర్‌నేషనల్ మ్యాచ్‌లలో తగినన్ని అవకాశాలు లభిస్తే ఆటగాడిగా శుభ్‌మన్ మరింత రాటుదేలుతాడని అన్నాడు.