Bajrang Punia: భారత జెండాను తొక్కిన బజరంగ్ పూనియా.. వీడియో వైరల్-bajrang punia standing on indian flag poster video viral when welcoming vinesh phogat from delhi airport after olympics ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bajrang Punia: భారత జెండాను తొక్కిన బజరంగ్ పూనియా.. వీడియో వైరల్

Bajrang Punia: భారత జెండాను తొక్కిన బజరంగ్ పూనియా.. వీడియో వైరల్

Sanjiv Kumar HT Telugu
Aug 17, 2024 06:09 PM IST

Bajrang Punia Standing On Indian Flag Video Viral: భారత వెటరన్ రెజ్లర్ బజరంగ్ పూనియా వివాదంలో ఇరుక్కున్నాడు. మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్‌కు స్వాగతం పలికేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన బజరంగ్ పూనియా కారుపై భారత జెండా ఉన్న పోస్టర్‌ను తొక్కాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారత జెండాను తొక్కిన బజరంగ్ పూనియా.. వీడియో వైరల్
భారత జెండాను తొక్కిన బజరంగ్ పూనియా.. వీడియో వైరల్

Bajrang Punia Standing On Indian Flag: పారిస్ ఒలింపిక్స్ 2024 సెమీఫైనల్ 50 కేజీల మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ మ్యాచ్‌లో విజయం సాధించిన వినేష్ ఫోగాట్ ఫైనల్స్‌కు చేరినప్పటికీ 100 గ్రాముల తేడాతో అనర్హతకు గురయ్యారు. దాంతో ఆమెకు ఎలాంటి పతకం రాలేదు.

వినేష్ ఫోగాట్‌కు ఘన స్వాగతం

ఇక ఒలింపిక్స్ అనంతరం వినేష్ ఫోగాట్ ఇవాళే (ఆగస్ట్ 17) భారత్‌కు చేరుకున్నారు. స్వదేశానికి వచ్చిన వినేష్ ఫోగాట్‌కు ఘన స్వాగతం లభించింది. పతకం లేకుండా వచ్చినప్పటికీ వినేష్‌కు స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులతోపాటు సహచర రెజ్లర్స్, ఆమె అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వినేష్ ఫోగాట్‌కు స్వాగతం పలికిన వారిలో ఆమె కో రెజ్లర్స్ బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ కూడా ఉన్నారు.

చుట్టుముట్టిన మీడియా

అయితే, వినేష్‌కు స్వాగతం పలికేందుకు వీరు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి వినేష్ ఫోగాట్‌ను స్వగ్రామానికి తీసుకొచ్చారు. అయితే, ఈ క్రమంలోనే బజరంగ్ పూనియా చేసిన ఓ తప్పిదం సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఓపెన్ టాప్ కారులో వినేష్ ఫోగాట్ అభివాదం చేస్తూ ముందుకు సాగింది. ఈ క్రమంలో ఆమెతో మాట్లాడేందుకు మీడియా చుట్టుముట్టింది.

భారత జెండాను తొక్కిన బజరంగ్

వినేష్ కారును మీడియా చుట్టుముట్టడంతో వాహనం ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. దాంతో బజరంగ్ పూనియా ముందుకు వచ్చి మీడియాను, చుట్టూ ఉన్న జనాన్ని తప్పించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే బజరంగ్ చూసుకోకుండా కారుపై ఉన్న భారత త్రివర్ణ పతాకంపై పోస్టర్స్‌పై నిల్చున్నాడు. గుంపును తప్పించే ప్రయత్నంలో భారత జాతీయ జెండా పోస్టర్‌ను బజరంగ్ తొక్కినట్లు అయింది.

వీడియో వైరల్

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ బజరంగ్ పూనియాపై మండిపడుతున్నారు. భారత పతాకాన్ని గౌరవించాలనే భావన కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా బజరంగ్ పూనియాపై కామెంట్స్ చేస్తూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

తెలియకుండానే వివాదం

అంతేకాకుండా ఈ విషయంలో బజరంగ్ పూనియాపై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇలా తనకు తెలియకుండానే బజరంగ్ పూనియా వివాదంలో ఇరుక్కున్నట్లు అయింది. ఇదిలా ఉంటే, పారిస్ ఒలింపిక్స్‌ 2024లో వినేష్ ఫోగాట్ ఎలాంటి పతకాన్ని వరించకుండానే స్వదేశానికి వచ్చారు.

పిటిషన్ తిరస్కరణ

తుది పోరుకు అర్హత సాధించే క్రమంలో తాను ఎలాంటి పొరపాటు చేయలేదని, సంయుక్త రజత పతకం ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (Court of Arbitration for Sport/CAS)ను వినేష్ ఫోగాట్ కోరారు. ఈ పోరాటంలో వినేష్ ఫోగాట్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అడహక్ డివిజన్ సోల్ ఆర్బిట్రేటర్ అనబెల్ బెనెట్ ఆగస్ట్ 16న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.