Ind vs Pak: బాబర్ ఆజం ఆ ఒక్క తప్పూ చేయకపోయి ఉంటేనా..: వసీం అక్రమ్
Ind vs Pak: బాబర్ ఆజం ఒక్క తప్పు చేశాడని, ఆ తప్పే ఇండియాతో మ్యాచ్‌లో పాకిస్థాన్ కొంప ముంచిందని అన్నాడు ఆ టీమ్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్. ఇంతకీ బాబర్ అంత పెద్ద తప్పు ఏం చేశాడు?
Ind vs Pak: చాలా రోజుల తర్వాత క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లో ఉండే అసలుసిసలు కిక్కేంటో తెలిసొచ్చింది. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్‌ను 5 వికెట్లతో ఓడించి గతేడాది వరల్డ్‌కప్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. కాస్త కష్టమ్మీదే అయినా.. మొత్తానికి గెలిచారు.
అయితే పాకిస్థాన్ ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ఆ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం చేసిన ఆ ఒక్క తప్పిదమే కారణమని అంటున్నాడు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్. ఈ మ్యాచ్ చివరి ఓవర్‌ను స్పిన్నర్ నవాజ్‌తో వేయించడమే అతడు చేసిన తప్పని అన్నాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌ను అతడితో వేయించిన బాబర్.. చివరి ఓవర్ వరకూ నవాజ్ వైపు చూడలేదు. ఇదే పాక్ కొంప ముంచిందని అక్రమ్ అభిప్రాయపడ్డాడు.
"ఈ టీ20 టైప్ పిచ్ నాకు బాగా నచ్చింది. రెండు టీమ్స్‌లోని బౌలర్లు బౌన్సర్లు వేసి వికెట్లు రాబట్టడం బాగుంది. చివరి ఓవర్ వరకూ వెళ్లిన ఈ క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ రేపింది. అయితే బాబర్ ఒక తప్పు చేశాడు. నవాజ్‌తో 13 లేదా 14వ ఓవర్ వేయించేసి ఉండాల్సింది. చాలా ఆలస్యమైంది. టీ20ల్లో ఓ స్పిన్నర్‌తో చివరి మూడు లేదా నాలుగు ఓవర్లలో వేయించకూడదు. అందులో జడేజా, హార్దిక్ పాండ్యాలాంటి వాళ్ల ఉన్నప్పుడు" అని మ్యాచ్ తర్వాత స్టార్ స్పోర్ట్స్‌తో అక్రమ్ అన్నాడు.
చివరి ఓవర్లో విజయానికి 7 రన్స్ అవసరం కాగా.. తొలి బాల్‌కే జడేజాను ఔట్ చేశాడు నవాజ్. రెండో బాల్‌కు సింగిల్, మూడో బాల్ డాట్ కావడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే నాలుగో బాల్‌కు సిక్స్ కొట్టి మ్యాచ్ చివరి బాల్ వరకూ వెళ్లకుండానే హార్దిక్ ముగించేశాడు. అయితే ఈ మ్యాచ్ చూసిన తర్వాత పాకిస్థాన్ ఫాస్ బౌలింగ్‌కు మాత్రం మరింత మంచి ఫ్యూచర్ ఉండబోతుందన్న విషయం అర్థమైందని అక్రమ్ చెప్పాడు.
"నవాజ్ తెలివైన బౌలర్. అయితే ఆ బాల్‌ను నేరుగా వేయడం వల్ల హార్దిక్ సిక్స్ కొట్టగలిగాడు. ఇండియా బాగా ఆడింది. కానీ పాకిస్థాన్ బౌలర్ దహానీ నన్ను ఆకట్టుకున్నాడు. అలాగే తొలి గేమ్ ఆడుతున్న 21 ఏళ్ల నసీమ్ షా కూడా. హరీస్ రవూఫ్ నిలకడగా ఆడుతున్నాడు. ఆ లెక్కన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలింగ్‌కు మంచి ఫ్యూచర్ ఉంది" అని అక్రమ్ అభిప్రాయపడ్డాడు.
సంబంధిత కథనం