India vs Australia 2nd T20I: భారత్ ముందు భారీ లక్ష్యం.. దుమ్మురేపిన వేడ్, ఫించ్-australia get huge score 90 in 8 overs against india in second t20i ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Australia 2nd T20i: భారత్ ముందు భారీ లక్ష్యం.. దుమ్మురేపిన వేడ్, ఫించ్

India vs Australia 2nd T20I: భారత్ ముందు భారీ లక్ష్యం.. దుమ్మురేపిన వేడ్, ఫించ్

Maragani Govardhan HT Telugu
Sep 23, 2022 10:18 PM IST

India vs Australia: టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా 8 ఓవర్లలో 90 పరుగులు చేసింది. మ్యాథ్యూ వేడ్ 43 పరుగులతో ఆకట్టుకోగా.. కెప్టెన్ ఫించ్ 31 పరుగులతో రాణించాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు.

<p>భారత్-ఆస్ట్రేలియా</p>
భారత్-ఆస్ట్రేలియా (AFP)

India vs Australia 2nd T20I: టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. అవుట్ ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా మ్యాచ్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఫలితంగా మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌ దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ముందు కెప్టెన్ ఆరోన్ ఫించ్.. ఆ తర్వాత మ్యాథ్యూ వేడ్ దూకుడుగా ఆడటంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా.. బుమ్రా ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

టాస్ ఓడి ముందు బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభేమి దక్కలేదు. రెండో ఓవర్లోనే గత మ్యాచ్ హీరో కేమరూన్ గ్రీన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే గ్లెన్ మ్యాక్స్‌వెల్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ ఫించ్ అదరగొట్టాడు. వరుస పెట్టి ఫోర్లు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. ఓ పక్క స్కోరు పరుగులు తీస్తున్నప్పటికీ వికెట్లు కూడా అలాగే పడ్డాయి. అక్షర్ తన వేసిన రెండో ఓవర్లో టిమ్ డేవిడ్‌ను పెవిలియన్ చేర్చడంతో స్కోరు కాస్త నెమ్మదించింది. అయితే ఫించ్ మాత్రం అస్సలు తగ్గలేదు. అతడు 15 బంతుల్లో 4 ఫోర్లు ఓ సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు.

అయితే ప్రమాదకరంగా మారుతున్న ఫించ్‌ను బుమ్రా బౌల్డ్ చేయడంతో 46 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. అయితే ఫించ్ అవుట్‌ అయిన తర్వాత మ్యాథ్యూ వేడ్ ధాటిగా ఆడి టీమిండియా బౌలర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన అతడు స్కోరు వేగాన్ని పెంచాడు. ముఖ్యంగా హర్షల్ వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు బాది ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫలితంగా ఆసీస్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్ మూడు గంటల ఆలస్యంగా మొదలైంది. విదర్బ మైదానం అవుట్ ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా ఈ మ్యాచ్‌ టాస్ మూడు గంటల పాటు ఆలస్యమైంది. ఈ కారణంగా రిఫరీ మ్యాచ్ ఓవర్లను కుదించారు. ఇరు జట్లకు చెరో 8 ఓవర్లు ఆడే అవకాశాన్ని కలగజేశారు. ఇందులో అత్యధికంగా ఏ బౌలరైన రెండు ఓవర్లు మాత్రమే వేసే అవకాశముంది. రెండు ఓవర్లు పవర్ ప్లే ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం