Asia Cup 2022: పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లి దంచి కొడతాడు: యూనిస్ ఖాన్
Asia Cup 2022: పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లి గతంలో ఎలా అయితే ఆడాడో ఇప్పుడు ఆసియా కప్‌లోనూ అలాగే ఆడతాడని అంటున్నాడు ఆ టీమ్ మాజీ బ్యాటర్ యూనిస్ ఖాన్. విరాట్‌కు ఓ సలహా కూడా ఇచ్చాడతడు.
Asia Cup 2022: ఆసియా కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆదివారం (ఆగస్ట్ 28) మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌తోనే విరాట్ కోహ్లి చాలా రోజుల తర్వాత మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి తిరిగొస్తున్నాడు. పైగా ఇది కోహ్లికి 100వ టీ20 మ్యాచ్ కానుండటం మరో విశేషం. ఈ నేపథ్యంలో ఫామ్‌లోని లేని కోహ్లి.. ఈ మ్యాచ్‌తోనే తిరిగి ఫామ్‌లోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు.
నిజానికి పాకిస్థాన్‌పై విరాట్‌కు తిరుగులేని రికార్డు ఉంది. అసలు వన్డేల్లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు అయిన 183 రన్స్ కూడా పాక్‌పైనే, అది కూడా ఆసియా కప్‌లోనే చేశాడు. 2012 ఆసియాకప్ మ్యాచ్‌లో పాక్‌పై కోహ్లి చెలరేగి ఆడాడు. అయితే చాలా కాలంగా ఫామ్‌లో లేని విరాట్ ఇప్పుడు ఆసియాకప్‌లో మళ్లీ చెలరేగుతాడని పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ అంటున్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై అతడు కామంట్ చేశాడు.
"బాబర్ పర్ఫార్మెన్స్ అందరూ చూస్తూనే ఉన్నారు. అన్ని ఫార్మాట్లలోనూ అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. కోహ్లి ఆడలేదని కాదు. కానీ కొంత కాలంగా అతడు తన స్థాయికి తగినట్లు ఆడలేకపోతున్నాడు. కానీ ఫామ్ ఒకటి లేదా రెండు మ్యాచ్‌లలో మారిపోతుంది. ఈ ఆసియా కప్‌లో విరాట్ కచ్చితంగా ఫామ్‌లోకి వస్తాడని నాకు అనిపిస్తోంది. అతనికి వేదిక సిద్ధంగా ఉంది. పాకిస్థాన్‌పై గతంలో అతని రికార్డులు చూస్తే.. ఈ ఆసియా కప్‌లోనూ అదే రిపీట్ చేస్తాడని అనుకుంటున్నా" అని యూనిస్ ఖాన్ అన్నాడు.
ఇక విరాట్ తిరిగి ఎలా ఫామ్‌లోకి రావాలో కూడా యూనిస్ చెప్పాడు. "ఎంతో మంది ప్లేయర్స్ ఈ దశను ఎదుర్కొన్నారు. వాళ్లు రన్స్ చేయలేకపోయారు. ఇదే మన చివరి మ్యాచ్ లేదా సిరీస్ అనిపిస్తుంది. నేనూ అలాంటి దశ ఎదుర్కొన్నాను. కానీ నేను సింపుల్ ఫార్ములాను ఫాలో అయ్యాను. బేసిక్స్ సరిగా చేయడమే మనం చేయాల్సింది. విరాట్ కూడా అది చేస్తే చాలు" అని యూనిస్ చెప్పాడు. టీమ్ కోసం పరిస్థితులకు తగినట్లు ఆడితే సరిపోతుందని అన్నాడు.
సంబంధిత కథనం