Ashwin on Sanju Samson: వరల్డ్ కప్ టీమ్‌లో సంజూ శాంసన్ ఉండాలా? అశ్విన్ సమాధానమిదీ
Ashwin on Sanju Samson: వరల్డ్ కప్ టీమ్‌లో సంజూ శాంసన్ ఉండాలా? దీనిపై అశ్విన్ స్పందించాడు. అయితే ఈ ప్రశ్నకు అతడు నేరుగా సమాధానం ఇవ్వలేదు.
Ashwin on Sanju Samson: ఇప్పుడున్న ఇండియన్ టీమ్ లో ఎక్కువగా అన్యాయం జరుగుతోంది ఎవరికి అని అడిగితే చాలా మంది అభిమానులు చెప్పే పేరు సంజూ శాంసన్. ఎంతో టాలెంట్ ఉన్నా.. అతనికి తగిన అవకాశాలు రావడం లేదని అభిమానులు భావిస్తున్నారు. అతన్ని రెగ్యులర్ గా టీ20, వన్డే జట్లలోకి తీసుకోవాలన్న డిమాండ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
వన్డే వరల్డ్ కప్ జరగనున్న ఏడాదిలో, ఇండియన్ టీమ్ లో నాలుగో స్థానానికి సరైన బ్యాటర్ దొరకని నేపథ్యంలో సంజూ శాంసన్ కు ఆ అవకాశం ఇవ్వాలని ఎక్స్‌పర్ట్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హాట్ టాపిక్ పై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో అదే సంజూ శాంసన్ కెప్టెన్సీలో అశ్విన్ ఆడబోతున్న విషయం తెలిసిందే.
అయితే అతడు ఈ ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వలేదు. "ఈ విషయంపై చాలా కామెంట్స్ వచ్చాయి. చాలా మంది ప్లేయర్స్ కు అవకాశాలు ఇస్తున్నాం. అలాగే సంజూ శాంసన్ కు కూడా ఇవ్వాలని వసీం జాఫర్ అన్నాడు. అభిమానులు కూడా అదే అడుగుతున్నారు. అందరికీ అవకావశాలు ఇస్తున్నారు.
సంజూకి ఎందుకివ్వరు అని అడుగుతున్నారు. ఎవరికి అవకాశం ఇవ్వాలో చెప్పడానికి నేను ఇక్కడ లేను. ఇండియా వరల్డ్ కప్ గెలవాలి. అలా జరగడానికి కావాల్సిన అన్ని సానుకూల సంకేతాలు మనం ఇవ్వాలి. నా ఆలోచనా విధానం అలా ఉంది" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ చెప్పాడు.
వన్డేల్లో నాలుగోస్థానంలో కుదురుకుంటున్న శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. సర్జరీ చేయించుకుంటే ఎన్నాళ్లు దూరమవుతాడో తెలియదు. ఇక సూర్యకుమార్ వన్డేల్లో తగినంత ప్రభావం చూపలేకపోతున్నాడు. దీంతో సంజూకి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. సంజూ ఇప్పటి వరకు 11 వన్డేలు ఆడి 66 సగటుతో 330 రన్స్ చేశాడు. సూర్య కంటే అతని సగటు చాలా మెరుగ్గా ఉంది.
2019 వరల్డ్ కప్ లోనూ సరైన నాలుగో నంబర్ బ్యాటర్ లేకపోవడం వల్ల టీమిండియా ఇబ్బందులు పడింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాకుండా ఆ సమయంలోపు సరైన బ్యాటర్ ను వెతికి పట్టుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
సంబంధిత కథనం