ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నీ లోగో ఆవిష్కరించిన జగన్
వచ్చే నెలలో జరగబోయే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నీకి సంబంధించిన లోగోను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఇండియాలో ఇప్పటికే ఇలాంటి లీగ్‌లు మరో మూడు జరుగుతున్నాయి.
అమరావతి: ఇండియాకు ఐపీఎల్ తరహాలోనే ఆయా రాష్ట్రాలకు కొన్ని క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లు ఇప్పటికే నిర్వహిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, సౌరాష్ట్రలు ఈ లీగ్‌లు నిర్వహిస్తుండగా.. తాజాగా ఆంధ్ర కూడా వాళ్ల రూట్‌లోనే వెళ్తోంది. గత నెలలోనే బీసీసీఐ నుంచి ఈ లీగ్‌కు సంబంధించిన అనుమతులు వచ్చాయి. దీంతో సోమవారం ఈ లీగ్ లోగోను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఇతర సభ్యులు సీఎం జగన్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా లీగ్ లోగోతోపాటు టీజర్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జులై 6 నుంచి జులై 17 వరకూ జరగనుంది. విశాఖపట్నంలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈ టోర్నీ జరగనుంది. ఈ లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు రావాల్సిందిగా సీఎం జగన్‌ను అసోసియేషన్ సభ్యులు ఆహ్వానించారు.
ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు శరత్ చంద్రా రెడ్డి, కోశాధికారి గోపీనాథ్ రెడ్డి, సీఈవో శివారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సత్యప్రసాద్, సభ్యులు ప్రసాద్, గోపాల రాజు, టెక్నికల్ ఇన్‌ఛార్జ్ విష్ణు దంతు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.