Vinayaka chavithi 2024: వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు? దీని వెనుక ఉన్న కథ ఏంటి?-why is chandra darshan prohibited on ganesh chaturthi know the story and forbidden chandra darshan time ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vinayaka Chavithi 2024: వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు? దీని వెనుక ఉన్న కథ ఏంటి?

Vinayaka chavithi 2024: వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు? దీని వెనుక ఉన్న కథ ఏంటి?

Gunti Soundarya HT Telugu
Sep 03, 2024 05:15 PM IST

Vinayaka chavithi 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గణేష్ చతుర్థిని కళంక్ చతుర్థి అని కూడా అంటారు. ఈ రోజు చంద్ర దర్శనం నిషిద్ధం. దీని వెనుక ఉన్న కథను తెలుసుకోండి. దృక్ పంచాంగ్ నుండి నిషేధిత చంద్రదర్శనం సమయం తెలుసుకోండి. చంద్రుడిని చూడటం వల్ల కృష్ణుడు ఎదుర్కొన్న నింద ఏంటో తెలుసుకోండి.

వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు?
వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు? (pixabay)

Vinayaka chavithi 2024: గణేష్ చతుర్థిని వినాయక చవితి అని కూడా అంటారు. భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి రోజు వినాయకుడు జన్మించాడని చెబుతారు. అందుకే ఏటా ఈరోజు వినాయక చవితి జరుపుకుంటారు. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి పండుగ 7 సెప్టెంబర్ 2024, శనివారం జరుపుకోనున్నారు.

వినాయక చవితి వేడుకలు పది రోజుల పాటు జరుపుకుంటారు. అనంత చతుర్దశి రోజున గణేష్ నిమజ్జనంతో వేడుకలు ముగుస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చతుర్థి తిథి నాడు చంద్రదర్శనం నిషిద్ధం. దృక్ పంచాంగ్ ప్రకారం, చతుర్థి తిథి ప్రారంభం, ముగింపు ఆధారంగా వరుసగా రెండు రోజులు చంద్రుని దర్శనం నిషేధంలో ఉంది. ముఖ్యంగా సంపూర్ణ చతుర్థి తిథి నాడు చంద్రదర్శనం నిషిద్ధం.

గణేష్ చతుర్థి రోజున చంద్రుని దర్శనం ఎందుకు నిషేధించబడింది? చంద్రుడిని చూడటం వల్ల జరిగే అనార్థాలు ఏంటి? చంద్రుడిని చూడటం వల్ల కృష్ణుడు ఎదుర్కొన్న నిందలు ఏంటో తెలుసుకుందాం. చంద్రుడిని చూసిన వ్యక్తి దొంగతనం చేసిన తప్పుడు ఆరోపణను ఎదుర్కోవలసి ఉంటుంది.

చంద్రుడిని ఎందుకు చూడకూడదు?

పురాణాల ప్రకారం ఒకరోజు వినాయకుడు బొజ్జ నిండా కుడుములు, రకరకాల పిండి వంటలు, ఉండ్రాళ్లు తిని మరికొన్ని చేతిలో పట్టుకుని భుక్తాయాసంతో ఇంటికి చేరుకున్నాడు. తల్లిదండ్రులకు నమస్కరిద్దామని వంగడానికి ప్రయత్నించాడు. కానీ పొట్ట బిర్రుగా ఉండటం వల్ల వంగలేక అవస్థలు పడటంతో పొట్ట పగిలి కుడుములు అన్నీ బయటకు వచ్చాయి.

శివుడి తల మీద ఉన్న చంద్రుడు అది చూసి పకా పకా నవ్వాడు. దీంతో ఆగ్రహించిన వినాయకుడు చంద్రుడిని శపించాడు. ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళు నీలాపనిందలు పడాల్సి వస్తుందని చెప్పాడు. దేవతలు విషయం తెలిసి వేడుకోగా భాద్రపద చతుర్థి రోజుకు మాత్రం శాపం వర్తిస్తుందని అన్నాడు. అలా చవితి రోజు చంద్ర దర్శనం నిషేధంగా చెప్తారు.

కృష్ణుడికి నిందలు

పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడికి వినాయక చవితి రోజు చంద్రుడి గురించి ఉన్న శాపాన్ని నారద మహర్షి చెప్పారు. అయితే కృష్ణుడు పొరపాటున చతుర్థి రోజు చంద్రుడిని చూస్తాడు. దీంతో శమంతకమణి అనే విలువైన రత్నాన్ని దొంగిలించాడని తప్పుడు ఆరోపణ ఎదుర్కోవాల్సి వచ్చింది. తప్పుడు ఆరోపణలో చిక్కుకున్న శ్రీకృష్ణుడి పరిస్థితిని చూసిన నారద మహర్షి, భాద్రపద శుక్ల చతుర్థి రోజున శ్రీకృష్ణుడు చంద్రుడిని చూశాడని, అందుకే తప్పుడు ఆరోపణతో శపించబడ్డాడని చెప్పాడు. నారదుడి సలహా మేరకు శ్రీకృష్ణుడు గణేశ చతుర్థి వ్రతాన్ని ఆచరించి తన మీద పడిన నింద నుండి విముక్తి పొందాడు.

ఈ మంత్రం పఠించాలి

దృక్ పంచాంగ్ ప్రకారం గణేష్ చతుర్థి రోజున పొరపాటున చంద్రుడిని చూస్తే నీలాపనిందల నుంచి బయటపడేందుకు “సింగ్ ప్రసేనాంవధిత్సింఘో జాంబవత హతః'. సుకుమారాక్ మరోదిస్తవ హ్యేష స్యమంతకః” అనే మంత్రాన్ని జపించాలి.

చంద్రదర్శనం

పంచాంగం ప్రకారం చంద్రుని దర్శనం కోసం నిషేధించబడిన సమయం 07 సెప్టెంబర్ 2024 ఉదయం 09:29 నుండి రాత్రి 08:44 వరకు ఉంటుంది. ఈ వ్యవధి 11 గంటల 15 నిమిషాలు. ఈ సమయంలో పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు. పొరపాటున చూసినట్టయితే వినాయకుడికి పూజ చేసి పైన చెప్పిన మంత్రాన్ని పఠించి అక్షింతలు తల మీద వేసుకుని క్షమించమని అడగాలి. ఇలా చేయడం వల్ల ఇబ్బందుల నుంచి బయట పడతారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner