Gruhapravesham: కొత్త ఇంట్లో గోవుతో గృహ ప్రవేశం ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటి?-why do you enter a new house with a cow what is the meaning behind this ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Gruhapravesham: కొత్త ఇంట్లో గోవుతో గృహ ప్రవేశం ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటి?

Gruhapravesham: కొత్త ఇంట్లో గోవుతో గృహ ప్రవేశం ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటి?

Gunti Soundarya HT Telugu
Oct 28, 2024 11:06 AM IST

Gruhapravesham: కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసేటప్పుడు ముందుగా గోమాతతో కలిసి ప్రవేశిస్తారు. ఇలా చేయడం వల్ల దేవతల ఆశీర్వాదం లభిస్తుందని అందరి విశ్వాసం. ఈ ఆచారం ఎందుకు పాటిస్తారు? దీని వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసుకుందాం.

గోమాతతో గృహప్రవేశం ఎందుకు చేస్తారు?
గోమాతతో గృహప్రవేశం ఎందుకు చేస్తారు? (pinterest)

సొంతిల్లు కట్టుకుని అందులో ఉండాలని ప్రతి ఒక్కరి కల. అందుకోసం జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు. అప్పో సొప్పో చేసి తమకంటూ సొంతిల్లు ఉంది అని ఆనందపడతారు. ఇల్లు కట్టుకున్న తర్వాత అందులో గృహప్రవేశం చేస్తే ఆ కుటుంబం ఆనందానికి అవధులు ఉండవు.

గోవుతో తొలి అడుగు ఎందుకు పెట్టిస్తారు?

గృహప్రవేశం చేసేటప్పుడు ముహూర్తం దగ్గర నుంచి అన్నీ ఆచారబద్ధంగా నిర్వహిస్తారు. వాటిలో మొదటిగా ఆచరించే పద్ధతి గోమాతతో గృహప్రవేశం. గోవును ఇంట్లోకి తీసుకెళ్ళి ప్రతి గదిలో తిప్పుతూ మంత్రాలు పఠిస్తారు. ఆ తర్వాత ఇతర కుటుంబ సభ్యులు ఇంట్లోకి ప్రవేశిస్తాడు. గోవును మహాలక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే గోవును ఇంట్లోకి తీసుకొచ్చే ముందు పసుపు, కుంకుమ రాసి బొట్టు పెట్టి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తారు.

గోవుతో ముందుగా గృహప్రవేశం చేయించే ఆచారం అనాదిగా వస్తోంది. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని అంటారు. అందుకే కొత్తగా నిర్మించిన ఇంట్లోకి ముందుగా గోవు ప్రవేశించడం వల్ల అంతా మంచే జరుగుతుందని, ఆ ఇంటి మీద దేవతల ఆశీర్వాదాలు ఉంటాయని నమ్ముతారు. ఇంట్లోకి ప్రవేశించినప్పుడు గోవు మూత్రం పోసినా, పేడ వేసిన అత్యంత శుభకారంగా భావిస్తారు.

పల్లెటూరులో అయితే ఈ ఆచారం ఇప్పటికీ పాటిస్తున్నారు. కానీ నేటి పట్టణపు వాసులు ఎక్కువగా అపార్ట్ మెంట్ లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అటువంటి వాటిలోకి గోవుతో గృహప్రవేశం చేయడం సాధ్యం కాదు. అందువల్ల చాలా మంది ఆవు దూడను తీసుకొచ్చి అలంకరించి దానికి నైవేద్యం సమర్పిస్తారు. గోమాత యజమానికి దక్షిణ ఇచ్చి వారిని సంతోషపెడ్తారు. అలాగే గోమూత్రం తీసుకొచ్చి ఇల్లంతా చిలకరించుకుంటారు. ఇలా చేయడం వల్ల కొత్త ఇంట్లో గోవు తిరిగినట్టుగా భావిస్తారు. లేదంటే లేగదూడతో ఉన్న గోమాత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటారు.

గృహప్రవేశం చేసేటప్పుడు చేసే ప్రతి ఆచారం వెనుక అర్థం, పరమార్థం దాగి ఉంటాయి. ఇంటి ముందు చేసే అలంకరణ దగ్గర నుంచి కొత్త ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత పాలు పొంగించి క్షీరాన్నం అందరికీ పంచి పెట్టడం వరకు అన్ని సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తారు. కొందరు అయితే నూతన గృహంలోకి ప్రవేశించిన సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటారు.

తోరణాలు

కొత్త ఇంటికి బంతిపూల తోరణాలు, మామిడి ఆకులు, గుమ్మం ముందు అందమైన రంగవల్లులు లేకుండా అసంపూర్తిగా ఉంటుంది. మామిడి, బంతిపూల తోరణాలు ఇంటికి అందాన్ని మాత్రమే కాదు దేవతల ఆశీర్వదాన్ని తీసుకొస్తాయి. ఇవి ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీని రాకుండా చేస్తాయి. ఇంటికి వచ్చే బంధువుల మనసు ఆహ్లాదకరంగా, మంచి వాతావరణంలోకి వచ్చాము అనే ఫీలింగ్ ని తీసుకొస్తాయి.

పూజ చేయడం

దేవుళ్ళు, దేవతా మూర్తుల విగ్రహాలతో ఇంట్లోకి కుడి కాలుతో అడుగుపెడతారు. ఇంట్లోకి ప్రవేశించిన వారితో కొబ్బరి కాయ కొట్టిస్తారు. ఇది ఒక సంప్రదాయంలో భాగం. ఇంటి తూర్పు ముఖంగా దేవుళ్ళ చిత్రపటాలు ఉంచి పూజ నిర్వహిస్తారు. గణేష పూజ, వాస్తు దోషాలు తొలగించే పూజ, నవగ్రహ శాంతి పూజలు చేస్తారు. ఇది ఇంటిని శుద్ది చేస్తుంది. ఇంట్లోకి సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. చెడు శక్తి ఏదైనా ఉంటే తొలగించి వేస్తుంది. తర్వాత కొత్త గిన్నెలో పాలు పొంగించి క్షీరాన్నం వండి అందరికీ ప్రసాదంగా పంచి పెడతారు. తమ సంతోషాన్ని ఈ విధంగా అందరితో కలిసి పంచుకుంటారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner