Diwali puja: దీపావళి రోజు పూజలో లక్ష్మీదేవి విగ్రహం ఈ దిశలో పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి
Diwali puja: దీపావళి రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీపూజ నిర్వహించుకుంటారు. తమను ఏడాది మొత్తం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సిరి సంపదలతో అభివృద్ధి చేయమని కోరుకుంటూ పూజ చేస్తారు. ఈ పూజ సమయంలో లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలు ఏ దిశలో ఉండాలో తెలుసుకుందాం.
హిందూ మతంలో దీపావళి అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ వేడుక జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవి, వినాయకుడిని పూజిస్తారు.
దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ శ్రేయస్సు, సంతోషాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల శాంతి, సంపద నిలుస్తాయని విశ్వాసం. పూజ చేసేందుకు ఇంట్లో లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఏ దిశలో ఉంచి పూజ చేయాలి అనే విషయం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. గణేశుడి ఎడమ వైపున లక్ష్మీదేవి ఉంచాలని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది సరైనది కాదు. ఎడమ వైపు సాంప్రదాయకంగా భార్య స్థానంగా పరిగణిస్తారు.
లక్ష్మీదేవిని గణేశుడికి మాతృమూర్తిగా భావిస్తారు. అందుకే వినాయకుడికి లక్ష్మీదేవిని కుడి వైపున ఉంచాలి. విగ్రహాల ముఖాలు తూర్పు లేదా పడమర వైపుగా ఉండేలా సానుకూల శక్తి ప్రవాహానికి ప్రతీకగా ఉంచాలి. పూజ గదిలో బలిపీఠం ఏర్పాటు చేసి దాని మీద విగ్రహాలు ఉంచాలి. పువ్వులు, పండ్లు, స్వీట్లు, నాణేలు వంటి వాటిని నైవేద్యాలను ఏర్పాటు చేయండి. లక్ష్మీదేవి సంతోషకరంగా కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహం లేదా చిత్రపటాన్ని కొనుగోలు చేయడం ఉత్తమం.
లక్ష్మీ పూజ సమయంలో సరైన మంత్రాలను పఠించడం చేస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. ఈ పూజలో పఠించాల్సిన మంత్రాలు ఇవే..
ఓం శ్రీం హ్రీం శ్రీం మహా లక్ష్మీయై నమః
ఈ మంత్రాన్ని పూర్తి భక్తితో జపిస్తే సంపద, శ్రేయస్సు ఆకర్షిస్తుంది. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించవచ్చు. లక్ష్మీదేవి ఆశీస్సులు కోరుతూ అమ్మవారి 108 పేర్లను భక్తితో జపించాలి. అలాగే ఓం హ్రీం శ్రీం లక్ష్మీభయో నమః అనే మంత్రం పాటిస్తే సంపద, సమృద్ధి లభిస్తాయి.
పూజలో మంత్రాలు పఠించడం వల్ల ఆ స్థలం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతుంది. దేవతను ఆరాధిస్తూ భక్తులు మనస్పూర్తిగా వాటిని జపించాలి. దీపావళి సమయంలో లక్ష్మీ మంత్రాలను పఠించడం వల్ల లక్ష్మీదేవితో మీ బంధం మరింత బలపడుతుంది. సంపద, శాంతి, ఆనందం, ఆశీర్వాదాలు లభిస్తాయి.
కలశ స్థాపన
దీపావళి సందర్భంగా కలశ స్థాపన చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. రాత్రివేళ లక్ష్మీపూజ సమయంలో కలశాన్ని ప్రతిష్టించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది పూజ ప్రయోజనాలను రెట్టింపు చేస్తుంది. ఇంటికి శాశ్వతమైన శ్రేయస్సును అందిస్తుంది. ఇంట్లోని చెడు శక్తులను బయటకు పంపిస్తుంది. కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.