Sri rama navami 2024: శ్రీరామనవమి రోజు ఏం చేయాలి? ధర్మానికి రాముడికి ఉన్న సంబంధం ఏమిటి?-what to do on sri ram navami day what is the relation of dharma to rama ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sri Rama Navami 2024: శ్రీరామనవమి రోజు ఏం చేయాలి? ధర్మానికి రాముడికి ఉన్న సంబంధం ఏమిటి?

Sri rama navami 2024: శ్రీరామనవమి రోజు ఏం చేయాలి? ధర్మానికి రాముడికి ఉన్న సంబంధం ఏమిటి?

HT Telugu Desk HT Telugu
Apr 16, 2024 08:12 AM IST

Sri rama navami 2024: శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు? ధర్మానికి శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏమిటి అనే దాని గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.

శ్రీరామనవమి రోజు ఏం చేయాలి?
శ్రీరామనవమి రోజు ఏం చేయాలి? (pixabay)

Sri rama navami 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం చైత్ర మాస శుక్ల పక్ష నవమి తిథి రోజు పునర్వసు నక్షత్రంలో కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో గురు చంద్రులు దశమంలో రవి బుధులు ఉండగా బుధాదిత్య, గజకేసరి యోగం ఉండగా మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్‌ ముహూర్తంలో రామచంద్రుని జననం జరిగినట్లుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

చిలకమర్తి పంచాంగరీత్యా ధృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా 17.4.2024 బుధవారం చైత్ర మాస శుక్ల పక్ష నవమి మధ్యాహ్న వ్యాప్తి ఉండటం చేత 17 ఏప్రిల్‌ శ్రీరామనవమిగా జరుపుకోవాలని చిలకమర్తి తెలియచేశారు. శ్రీరామనవమి రోజే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగిందని, రామచంద్రమూర్తి కళ్యాణము జరిగినట్టుగా రామాయణం తెలియచేస్తుందని పంచాంగకర్త చిలకమర్తి తెలియచేశారు. అందువల్ల 17.4. 2024 శ్రీరామనవమి జరుపుకోవడం ఉత్తమమని చిలకమర్తి తెలిపారు.

శ్రీరామనవమి రోజు ఏం చేయాలి?

శ్రీరామనవమి రోజు సూర్యోదయానికి పూర్వం లేచి తలస్నానం వంటివి ఆచరించి ఆరోజు ఉపవాస దీక్ష వంటివి చేయడం ఉత్తమం. ఈరోజు ఇంటిలో రామచంద్రమూర్తిని పూజించి రామాలయం వంటివి దర్శించాలి. ఎక్కడైతే రామచంద్రమూర్తి కళ్యాణం జరుగుతుందో ఆ కళ్యాణాన్ని దర్శించడం చాలా విశేషం. రామూలవారి కల్యాణం దర్శించి రామచంద్రమూర్తి పట్టాభిషేక ఘట్టాన్ని చూడటం, వినడం, చదవడం మంచిదని చిలకమర్తి తెలిపారు.

అరోజు సాయంత్రం పూట రామాయణంలో సీతారాములకు పట్టాభిషేకం జరిగిందని చెప్తారు. వశిష్టులవారు హనుమంతులవారి సహాయంతో తెచ్చినటువంటి 500 నదుల తీర్ధ జలములతో రామచంద్రమూర్తికి వశిష్టుల వారి చేతులమీదగా పట్టాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన కథను వినటం శ్రీరామచంద్రమూర్తిని దర్శించి శ్రీరామకళ్యాణం పట్టాభిషేకం వంటివి చూసి కళ్యాణ అక్షింతలను శిరస్సుపై ధరిస్తే మంచిది. అలాగే శ్రీరామకోటి వంటివి రాసి తారకమంత్రం, రామనామస్మరణ వంటివి చేసి మళ్ళీ తరువాత రోజు రామాలయానికి వెళ్ళి రాములవారిని దర్శించి శ్రీరాముని పూజించినట్లయితే అటువంటి వారికి శ్రీరామనవమి ఫలితం లభిస్తుందని చిలకమర్తి తెలిపారు.

“మర్యాద పురుషోత్తముడు” అని అభిమానంగా పిలుస్తూ గౌరవింపబడే శ్రీరామ చంద్రుడు శ్రీమహావిష్ణువు ఏడవ అవతారం. శ్రీమహావిష్ణువు అన్ని అవతారాలలో రామావతారం “సంపూర్ణ అవతారం”గా పరిగణించబడుతుంది. శ్రీహరి కాలధర్మానికి అనుగుణంగా “ఆదర్శపురుషుడు”గా జీవితాన్ని ఎలా నడిపించాలో శ్రీరాముని అవతారంతో ప్రపంచానికి చూపించాడని చిలకమర్తి తెలిపారు.

సద్గుణాల రాముడు 

వాల్మీకి మహర్షి నారదమహామునిని ధర్మం, కార్యనిష్టృ సత్యప్రవర్తనకి ప్రతిబింబంగా పేర్కొనదగిన వ్యక్తి ఎవరు అని అడిగాడు. నారదుడు “నిజాయితి, శౌర్యం, ధార్మికత, సత్యం పలకడం, నిబద్ధత, నమ్మకం, లోపం లేని గుణం, సానుభూతి, జ్ఞానం, నైపుణ్యం, సున్నితమైన మనస్తత్వం, బాధ్యతాయుత నడవడి, ఇంద్రియనిగ్రహం, సమత్వం, నిబద్ధత, నిర్భయత్వం వంటి 16 గుణాలు కలిగిన శ్రీరామచంద్రుడు మాత్రమే అటువంటి లక్షణాలను కలవాడు అని సమాధానమిచ్చాడని చిలకమర్తి తెలిపారు.

“రామో విగ్రహవాన్‌ ధర్మః అంటే “రాముడు ధర్మస్వరూపుడు” అని అర్థం. రాముడి జీవితం మొత్తం ధర్మాన్ని అనుసరించే ఒక మార్గదర్శి. మనం రోజువారీజీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఆయన జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకోవచ్చు.

శ్రీరాముడు తండ్రి మాట జవదాటని కుమారుడు, విధేయుడైన విద్యార్థి, శక్తివంతమైన యోధుడు, మంచి స్నేహితుడు, నీతిమంతుడైన రాజు. తన జీవితంలోని ప్రతి దశలో ఒక ఉదాహరణగా నిలిచాడు. ఈ విశిష్టతే అతనిని శత్రువులను కూడా మెచ్చుకునేలా చేసింది. మారీచుడు పలికిన “రామో విగ్రహవాన్‌ ధర్మః” అన్న మాట శ్రీరాముడు ఎంత నీతిమంతుడో తెలియజేస్తుంది.

“శ్రీరామనామం” రాముని యొక్క అత్యున్నత గుణాల కారణంగా “తారకనామం”గా పరిగణిస్తారు. శ్రీరాముడు మహావిష్ణువు అవతారమైనా, లోకంలో బాధలను అనుభవించి మనిషిలా జీవించాడు. ధర్మమార్గంలో పయనిస్తే మనిషి భగవంతుడు అవుతాడని నిరూపించాడు. “ధర్మో రక్షతి రక్షితః" శ్రీరాముని మార్గమే ఆయనను అన్ని యుగాలకు ఆదర్శవంతమైన వ్యక్తిగా చేసిందని చిలకమర్తి తెలిపారు.

శ్రీరాముడి గుణాలను తెలిపే కీర్తనలు

అన్నమాచార్య, భక్తరామదాసు, త్యాగరాజు, పురందరదాసు, ముత్తుస్వామి దీక్షితార్‌ వంటి అనేకమంది కవులు శ్రీరామునిపై తమ భక్తిని పాటలు, కీర్తనలద్వారా వ్యక్తపరిచారు. వారు రామాయణం సారాంశాన్ని తీసుకొని అతని జీవితంలోని అనేక దశలను, అతని వ్యక్తిత్వంలోని అనేక లక్షణాలను కొనియాడారు. నవవిధభక్తి వారి రచనల్లో వ్యక్తమైంది. కొన్ని కీర్తనలు పురుషోత్తముడు అని కీర్తించాయి. మరికొన్ని రాముడి అందాన్ని వర్ణించాయి. ఇంకొన్ని అతని ధైర్యాన్ని కొనియాడాయి. చాలా పాటలు సౌశీల్య, వాత్సల్య, వీర్య, కారుణ్యం వంటి అతని లక్షణాలను తెలియచేశాయని చిలకమర్తి తెలిపారు.

అన్నమయ్య కీర్తన, “రామచంద్రుడుడీతడు” అతని శార్యం, కరుణవంటి లక్షణాలను ప్రశంసిస్తుంది. భక్తరామదాసు తన “పలుకే బంగారమాయెన”లో శ్రీరాముడు తన జీవితంలోని ప్రతిదశలో దయను కురిపించిన వ్యక్తిగా కీర్తించాడు. అతనిని ఏకైక రక్షకుడిగా అభివర్ణించాడు. ఇలా శ్రీరాముని గుణాలను తమ పాటల్లో సమర్థవంతంగా చిత్రించిన కవులు ఎందరో ఉన్నారు. పురందరదాసర్‌ రచించిన “రామ రామ రామ సీతా” అనే పాట “రామ” అనే నామం అన్ని సమస్యలకు పరిష్కారం అని, “రామనామం” బాధలనుండి రక్షిస్తుందని వర్ణించిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel