Shami plant: శమీ వృక్షం విశిష్టత ఏంటి? దసరా రోజు ఎందుకు ఈ చెట్టును పూజిస్తారు?
Shami plant: దసరా రోజు శమీ వృక్షాన్ని పూజించాలనే నియమం ఉంది. అసలు ఈ చెట్టును ఎందుకు పూజిస్తారు. దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి అనే విషయాల గురించి అధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
విజయదశమినాటి సూర్యాస్తమయానికి గంటన్నర ముందు కాలాన్ని విజయముహూర్తంగా నిర్ణయించారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆ సమయంలో శమీవృక్షం అంటే జమ్మి చెట్టును పూజిస్తారు. జమ్మికి 'అగ్నిగర్భ' అని పేరు. శమీ అంటే దోషాలను నాశనం చేసేది అని వ్యుత్పత్తి. దీనికే ‘శివా'.. అంటే సర్వశుభకరమైనదని మరోపేరు కూడా ఉంది అని చిలకమర్తి తెలిపారు. పాండవులు అజ్ఞాతవాసానికి ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపైనే దాచి ఉంచారని భారతం చెప్పే కథ అని చిలకమర్తి తెలిపారు.
సృష్టికర్త ఒక్కొక్క వస్తువునే సృష్టిస్తూ అగ్నిని కూడా సృష్టించాడు. అగ్ని పుడుతూనే తన ప్రభావాన్ని చూపించి, ప్రజాపతికే సెగలు పుట్టించింది. అందుకాయన భయపడి అగ్నిని శమింప చేసేందుకు శమీ వృక్షాన్ని సృష్టించాడు. దానికొమ్మలతో కొట్టి అగ్నిని శమింపచేశాడు. అగ్నిని తనలో నిలుపుకున్నందు వల్ల జమ్మి చెట్టు అగ్నిగర్భ అయింది. యజ్ఞయాగాదులలో అగ్ని రగిల్చే అరణిని జమ్మి కర్రలతోనే చేస్తారు. రోజూ జమ్మిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తే శరీరంలో ఉష్ణశక్తి పెరుగుతుందంటారు. సీతావియోగ బాధను అనుభవిస్తున్న శ్రీరామచంద్రుడు జమ్మిచెట్టు కిందనే నవరాత్ర వ్రతం చేశాడు. అందుకే జమ్మిచెట్టు... రామస్య ప్రియదర్శిని, శ్రీరామ పూజిత అయ్యిందని చిలకమర్తి తెలిపారు.
శమీ వృక్షం విశిష్టత
శ్రీరాముని పూర్వీకుడైన రఘుమహారాజు కాలం నాడు జరిగిన కథ శమీ వృక్షం గొప్పతనాన్ని తెలియచేస్తుంది. రఘుమహారాజు విశ్వజిద్యాగం నిర్వహించి విరివిగా దానధర్మాలు చేశాడు. తనవద్దనున్న ధనమంతా దానం చేసి, యాగాన్ని పరిసమాప్తి చేస్తున్న తరుణంలో ఆయన వద్దకు కౌత్సుడు అనే బ్రాహ్మణుడు వచ్చాడు. తన గురువుకు 14 కోట్ల బంగారు నాణేలను గురుదక్షిణగా ఇస్తానని మాటిచ్చానని ఆ నాణేలను దానంగా ఇప్పించవలసిందని రఘుమహారాజును కోరాడు. అప్పుడు రఘుమహారాజు దేవేంద్రుని సాయం కోరగా... దేవేంద్రుని ఆనతి చొప్పున కుబేరుడు అయోధ్యా నగరంలో స్వర్ణవర్షం కురిపించాడు. ఆశ్వయుజ శుద్ధ దశమినాడు కుబేరుడు జమ్మి చెట్టుపై స్వర్ణవర్షం కురిపించిన కారణంగా నేటికీ జమ్మిచెట్టును బంగారానికి ప్రతిగా భావిస్తారు.
జమ్మిచెట్టు రాష్ట్ర వృక్షంగా గల తెలంగాణ రాష్ట్రంలో జమ్మి ఆకులను బంగారంగా, వాటి కొమ్మలను వెండిగా పంచుతూ పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకునే సంప్రదాయం ఉంది. ఈ కార్యక్రమాన్ని 'సోనా దేనా' అని పిలుస్తారని చిలకమర్తి తెలిపారు. శతాబ్దాలుగా ఈ వేడుక ఐకమత్యానికి కూడా ప్రతీకగా నిలుస్తోంది. ఆంధ్రప్రాంతంలో జమ్మి ఆకులను సేకరించడానికి పార్వేట ఉత్సవం అని పేరు. జమ్మికొట్టుట అని కూడా అంటారు. భక్తులందరూ సమూహంగా తరలి వెళ్లి జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. జమ్మి ఆకులను సేకరిస్తారు. శమీశమయతే పాపం... అనే శ్లోకం రాసిన కాగితాలను జమ్మిచెట్టుకు కడతారు. చెట్టు ఎక్కకుండా కింద నుంచి అందిన ఆకులను తెంచుకుని వచ్చి, పెద్దలకు ఇచ్చి నమస్కరిస్తారని అధ్యాత్మికవేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.