Lord Shiva mantralu: శివరాత్రి రోజు చదవాల్సిన మంత్రం ఏంటి?శంకరాచార్యులవారు ఇచ్చిన శివోమంత్రం ఏమిటి?
మహా శివరాత్రి నాడు ఈ మంత్రాలు పఠించడం వల్ల శివయ్య అనుగ్రహం కలుగుతుందని పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
Lord Shiva mantralu: భారతీయ సనాతన ధర్మంలో శివారాధన చాలా విశిష్టమైనది. శివుడు భోళాశంకరుడు, అభిషేకప్రియుడు అని శాస్త్రం. అలాంటి శివుని అనుగ్రహం పొందటానికి ఆయనను వేదమంత్రాలతో స్తుతించడం, వేద మంత్ర పఠనం వంటివి చేయడం వలన శివానుగ్రహం పొందవచ్చు.
కలియుగంలో యుగ ప్రమాణం వలన వేదాధ్యయనం చేయనివారికి సామాన్య మానవులకు శివారాధన చేసేటప్పుడు శివ పంచాక్షరీ అనగా “ఓం నమః శివాయ” అనేటువంటి మంత్రంతో శివుని పూజించటానికి, ఆరాధించటానికి, స్తుతించటానికి విశేషమైన మంత్రమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శివమంత్రాలలో మరొక మంత్రం “ఓం తత్చురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రప్రచోదయాత్” అనేటటువంటి శివ మంత్రం కూడా చాలా విశేషమైనది. ఆదిశంకరాచార్యులవారు శివారాధనకు అనేక శ్లోకాలు, మంత్రాలు ఇచ్చారు. అందులో చాలా విశేషమైనటువంటిది నిర్వాణ శబ్దం, గురు దక్షిణామూర్తి స్తోత్రం ఇవి చాలా ప్రత్యేకమైనవని, విశేషమైనవని చిలకమర్తి తెలిపారు. ఈ మంత్రాలు శివరాత్రి వంటి దినాన విశేషించి ప్రతీ ముఖ్యమైన పారాయణ చేసేటటువంటి వారికి శివుని అనుగ్రహంచేత శుభఫలితాలు ఏర్పడతాయని చిలకమర్తి తెలిపారు.
శంకరాచార్యులవారు రచించినటువంటి స్తోత్రాలలో గురుదక్షిణామూర్తి స్తోత్రం కూడా చాలా విశేషమైనది. దక్షిణామూర్తి అనగా శివ శక్తి, అమ్మవారి శక్తి కలసి ఉన్నటువంటి దివ్య స్వరూపమని, దక్షిణామూర్తిని పూజించినట్లయితే శివపార్వతులను పూజించినట్లే అని సకల మునిజనులకు లోకములకు జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి దైవం దక్షిణామూర్తి అని ఈ స్తోత్రాలను శివరాత్రి రోజు పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.