Uthpanna Ekadashi 2023: రేపే ఉత్పన్న ఏకాదశి, ఆ రోజు విష్ణువును ఇలా పూజిస్తే సకల సంపదలు మీవే
Uthpanna Ekadashi 2023: ఉత్పన్న ఏకాదశి ఈ ఏడాది శుక్రవారం నాడు వచ్చింది. శుక్రవారం ఏకాదశి రావడం పరమ పవిత్రంగా భావిస్తారు.
Uthpanna Ekadashi 2023: కార్తీక మాసంలో రెండు ఏకాదశి తిథులు వస్తాయి. ఆ రెండూ కూడా పరమ విశిష్టమైనవి. ఏకాదశి అని పిలిచేది ఒక దేవతని, ఆ దేవతే కార్తీక మాసంలో జన్మించిందని చెబుతారు. అందుకే కార్తీకమాసంలో వచ్చే ఏకాదశిని పవిత్రంగా నిర్వహించుకుంటారు హిందువులు. కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈసారి ఏకాదశి శుక్రవారం పడింది. శుక్రవారం ఏకాదశి రావడం... అది కూడా ఉత్పన్న ఏకాదశి కావడంతో ఆరోజును భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజులలో ఉత్పన్న ఏకాదశి కూడా ఒకటి.
ముర అని పిలిచే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించిందని... ఆ శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిందని చెబుతారు. ఆ శక్తికి విష్ణువు ‘ఏకాదశి’ అని పేరు పెట్టినట్టు చెబుతారు. ఆమెను పూజించేందుకే ఏకాదశిని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ ఉత్పన్న ఏకాదశి రోజు కచ్చితంగా ఉపవాసం చేయాలని చెబుతారు. అలా ఉపవాసం చేసిన వారి పాపాలన్నీ పోతాయని అంటారు.
ఉత్పన్న ఏకాదశి రోజు...
ఉత్పన్న ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువును పూజించి ఆ తరువాతే ఆహారాన్ని భుజించాలి. ఇలా చేస్తే వైకుంఠ ప్రాప్తి పొందగలరని పురాణాలు చెబుతున్నాయి. వితంతువులు ఈ ఉత్పన్న ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పూజ చేస్తే వారు ముక్తిని పొందుతారని కూడా పురాణాల్లో ఉంది.
ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలనుకునేవారు ఆ తిథి మొదలైన క్షణం నుంచి కూడా ఆ తిథి ముగిసే క్షణం వరకు ఘనాహారం ఏదీ తీసుకోకుండా ఉండాలి. కొందరు నీటితో మాత్రమే గడుపుతారు. మరికొందరు పండ్లు వంటివి తింటారు. ఉపవాసం మన ఆరోగ్యానికి మంచిదే. కాబట్టి పూర్తిగా నీళ్లు మాత్రమే తాగుతూ ఉపవాసాన్ని నిర్వహించడం మంచిది.
ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు మొదలు?
డిసెంబర్ 8వ తేదీన వచ్చే ఉత్పన్న ఏకాదశి తిధి ఉదయం 5 గంటల 6 నిమిషాలకు మొదలవుతుంది. మళ్లీ శనివారం ఉదయం అంటే డిసెంబర్ 9వ తారీఖున 6 గంట 31 నిమిషాలకు ముగుస్తుంది. ఆ సమయం అంతా ఉపవాసం ఉంటే మంచిది. ఉత్పన్న ఏకాదశి రోజు సూర్యోదయం కంటే ముందే లేచి తల స్నానం చేయాలి. పూజా గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ముందు దీపారాధన చేయాలి. లేదా దగ్గరలోని దేవాలయాలకు వెళ్లినా మంచిదే. ఐదు రకాల పండ్లను మహావిష్ణువుకు సమర్పించి వాటిని దానం చేస్తే ఎంతో మంచిది. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉపవాసం ముగించే ముందు చేసిన తప్పులను క్షమించమని శ్రీమహావిష్ణువుని వేడుకొని ఆహారాన్ని భుజించాలి.