Koti somavaram: కోటి సోమవారం రోజు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది
Koti somavaram: కార్తీక మాసంలో నవంబర్ 9 కోటి సోమవారం వచ్చింది. ఈరోజు చేసే దానం, జపం, ఉపవాసం, స్నానం ఏదైనా సరే కోటి రెట్లు ఫలితం ఇస్తుందని స్కంద పురాణం చెబుతోంది. నేడు శివకేశవుల ఆరాధనకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు.
కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేశారు. ఈ ఏడాది కోటి సోమవారం నవంబర్ 9 శనివారం నాడు వచ్చింది.
కోటి సోమవారం అంటే ఏంటి?
కోటి సోమవారం అంటే సోమవారం వచ్చిన రోజునే పిలుస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ అది చాలా అరుదుగా మాత్రమే వస్తుంది. కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రంతో కూడిన తిథి వచ్చిన రోజును కోటి సోమవారంగా పరిగణిస్తారు. శ్రవణా నక్షత్రం నవంబర్ 8 ఉదయం 9. 18 గంటల నుంచి ప్రారంభమై నవంబర్ 9 ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయానికి నక్షత్రం ఉన్న రోజునే కోటి సోమవారంగా పరిగణిస్తారు. అలా నవంబర్ 9 కోటి సోమవారం వచ్చింది. ఈరోజు ఏ పని చేసిన అది కోటి రెట్లు ఫలితం ఇస్తుందని అంటారు. ఈరోజు చేసే స్నానం, దానం, జపం, ఉపవాసం వంటి వాటికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది.
కోటి రెట్లు పుణ్యం
కోటి సోమవారం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష కాలంలో ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఆలయానికి వెళ్ళాలి. శివాలయంలో దీపం వెలిగించి శివయ్యను దర్శించుకుంటారు. నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఇలా చేయడం వల్ల కోటి సోమవారాలు ఉపవాసమున్న ఫలితం దక్కుతుంది. పూజ చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. కోటి సోమవారం పూజ చేస్తే శాంతి, ఆనందం, ఐశ్వర్యం లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
కోటి సోమవారం రోజు ఉపవాసం చేస్తే శతకోటి పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అలాగే ఈరోజు శ్రీ మహా విష్ణువును కూడా పూజిస్తారు. శాలగ్రామ రూపంలో ఉన్న విష్ణువును ఆరాధిస్తారు. ఈరోజు శాలగ్రామాలను పూజించి బ్రహ్మణులకు దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది. కొందరు కోటి సోమవారం రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.