Holy rivers: భారత్ లోని పవిత్ర నదులు.. జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ మునిగితే పాపాలు తొలగుతాయి
Holy rivers: పవిత్రమైన సానుకూల శక్తులు కలిగిన ఆరు నదులు భారతదేశంలో ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ నదుల్లో పవిత్ర స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోయి మరణానంతరం మోక్షం లభిస్తుంది.
Holy rivers: భారతదేశం విభిన్న నదులకు నిలయం. ఇవి ప్రజలకు జీవనాధారం మాత్రమే కాదు దేవతలుగా భావిస్తూ పూజిస్తారు. ప్రతి నదికి ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాముఖ్యత ఉంది. భారత్ లో ఉన్న పవిత్ర నదులు సానుకూల, దైవిక శక్తలతో నిండి ఉన్నాయి. ఇక్కడ ప్రవహించే ఆరు పవిత్ర నదుల గురించి తెలుసుకుందాం. వాటిలో పవిత్ర నదీ స్నానం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
గంగ
భారత్ లోని అత్యంత పవిత్రమైన, స్వచ్చమైన నదులలో ఒకటి గంగా నది. ఇది కేవలం నదిగా మాత్రమే కాకుండా గంగా దేవిగా కొలుస్తారు. హిమాలయాల నుంచి ప్రవహిస్తుంది. ఉత్తర భారతదేశం గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగా నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి ఆత్మ శుద్ధి అవుతుందని నమ్ముతారు. హరిద్వార్, వారణాసి, రిషికేష్ లోని గంగా ఘాట్ దగ్గర ఉన్న సానుకూల శక్తులు సాటిలేనివి. పండుగలు, కుంభ మేళా, అమావాస్య, పౌర్ణమి తిథుల సమయాల్లో ఇక్కడ పుణ్య స్నానం ఆచరించేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు.
యమునా
గంగా నది తర్వాత రెండవ అత్యంత పవిత్రమైన నది యమునా. హిమాలయాల్లోని యమునోత్రి హిమనీనదం నుంచి మొదలవుతుంది. ఉత్తర భారతదేశంలోని మైదానాల గుండా ప్రవహిస్తోంది. త్రివేణి సంగం వద్ద గంగా నదిలో కలుస్తుంది. యమునా నదిలో స్నానం చేయడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి బయట పడి ఆత్మ శుద్ది అవుతుందని నమ్ముతారు. యమునా చౌత్ అనే పండుగను జరుపుకుంటారు. ఈరోజే యమునా దేవత భూమి మీదకు వచ్చిన రోజు అని నమ్ముతారు.
కావేరి
కర్ణాటక, తమిళనాడు గుండా ప్రవహించే కావేరి నది దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన నదుల్లో ఒకటి. పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి కొండల నుంచి ఉద్భవించింది. జీవనోపాధికి ముఖ్యమైన వనరు. అందుకే ఇది జీవనాన్ని ఇచ్చే నదిగా పిలుస్తారు. రైతుల భూములను సారవంతం చేస్తూ ఆహారాన్ని అందిస్తున్న ఈ నదికి శుద్ది చేసే లక్షణాలు ఉన్నాయని నమ్ముతారు.
గోదావరి
గోదావరి నదిని దక్షిణ గంగ అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలోని కుంభ మేళా మాదిరిగానే మహారాష్ట్రలోని నాసిక్ లో కూడా జరుగుతుంది. నాసిక్ లో జరిగే కుంభ మేళాకు గోదావరి నది కేంద్ర బిందువు. ఈ సమయంలో గోదావరి నదిలో స్నానం చేయడం వల్ల తమ పాపాలు తొలగిపోయి ఆధ్యాత్మిక విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. గోదావరి నదికి సంబంధించి అనేక స్థానిక పండుగలు కూడా జరుపుకుంటారు.
నర్మద
భారతదేశంలోని పవిత్ర నదులలో నర్మదా నది ఒకటి. భౌగోళికంగా నర్మదా నది గంగా నది కంటే పురాతనమైనది. హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ నదిని దేవతగా పూజిస్తారు. నర్మదా నది పుష్కరాలు, నర్మదా పరిక్రమ అంటూ 4 నుంచి 5 నెలల పాటు జరుగుతాయి. ఆధ్యాత్మిక జ్ఞానోదయం, మరణించిన తర్వాత ఆత్మకు విముక్తి కలిగించాలని కోరుకుంటూ ఈ యాత్ర చేపడతారు.
క్షిప్రా నది
క్షిప్రా నది సానుకూలత, ఆధ్యాత్మిక శక్తులతో నిండి ఉంది. ఇది హిందూ మతంలోని ఏడు పవిత్ర నగరాలలో ఒకటైన ఉజ్జయిని గుండా ప్రవహిస్తోంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సింహస్థ జాతర లేదా ఉజ్జయిని కుంభమేళా ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. భారతదేశం నలుమూలల నుంచి భక్తులు ఈ సింహస్థ జాతరకు హాజరవుతారు. ఈ సమయంలో క్షిప్రా నదిలో స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోతాయని, పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.