Daily Muggulu: ఇంటి ముందు రోజూ ముగ్గు ఎందుకు వేయాలి, ముగ్గు వెనుక పరమార్థం ఏంటి? ఈ 3 ప్రదేశాల్లో ముగ్గు తప్పక ఉండాలి-daily muggulu why we should keep rangoli everyday in front of house and what is the reason to keep rangoli and benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Daily Muggulu: ఇంటి ముందు రోజూ ముగ్గు ఎందుకు వేయాలి, ముగ్గు వెనుక పరమార్థం ఏంటి? ఈ 3 ప్రదేశాల్లో ముగ్గు తప్పక ఉండాలి

Daily Muggulu: ఇంటి ముందు రోజూ ముగ్గు ఎందుకు వేయాలి, ముగ్గు వెనుక పరమార్థం ఏంటి? ఈ 3 ప్రదేశాల్లో ముగ్గు తప్పక ఉండాలి

Peddinti Sravya HT Telugu
Dec 18, 2024 07:39 AM IST

Daily Muggulu: పూర్వకాలం నుంచి మన పెద్ద వాళ్ళు చెప్పారని మనం ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటాం. ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయాలి అనే సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది.

Daily Muggulu: ఇంటి ముందు రోజూ ముగ్గు ఎందుకు వేయాలి, ముగ్గు వెనుక పరమార్థం ఏంటి?
Daily Muggulu: ఇంటి ముందు రోజూ ముగ్గు ఎందుకు వేయాలి, ముగ్గు వెనుక పరమార్థం ఏంటి? (pinterest)

ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకుంటారు. ఇంట్లో ప్రతి వస్తువుని కూడా జాగ్రత్తగా ఉంచుకుంటారు. పండగలు వస్తే, ఇంట్లో ఉన్న సామాన్లు దులిపి మళ్లీ వాటిని వాటి స్థానంలో ఉంచుతారు. నిజానికి మన ఇల్లు అందంగా ఉంటే, మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. ఇల్లు అందంగా లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది.

అందుకనే ఎప్పుడు కూడా ఇంట్లో చెత్తాచెదారం ఉండకూడదని పెద్దలు అంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు వెంటనే శుభ్రంగా ఉంచుకోవాలి. సూర్యాస్తమయం అవ్వక ముందే వెంటనే శుభ్రంగా తుడుచుకోవాలి. ఇదిలా ఉంటే పూర్వకాలం నుంచి మన పెద్ద వాళ్ళు చెప్పారని మనం ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటాం. ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయాలి అనే సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది.

ఇంటి ముందు ఎందుకు ముగ్గు వేయాలి? ముగ్గు అంటే ఏంటి?

ముగ్గు వెనుక పరమార్థం

ఇంటి ముందు రోజు శుభ్రంగా తుడిచి, నీళ్లు చల్లి ముగ్గు వేస్తారు. గడప ముందు రెండు గీతలు గీస్తారు. ఇలా రెండు అడ్డగీతలు గీయడం వలన చాలా ఉపయోగం ఉందంట. అదేంటంటే, ఇంటి గడప ముందు రెండు అడ్డగీతలు గీయడం వలన దుష్టశక్తులు లోపలికి రావు. అంతేకాదు లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోదు.

ముగ్గు వేసి నాలుగు వైపులా రెండు అడ్డగీతలు గీస్తే శుభకార్యాలు జరుగుతాయి. మంగళకరమైన పనులు కూడా ఆ ఇంట జరుగుతాయి.

పండగల సమయంలో కచ్చితంగా ఇలా అడ్డగీతలు గీసి ముగ్గు వేయండి.

ముగ్గులను ఎందుకు తొక్కకూడదు?

కొంతమంది నక్షత్రం ఆకారంలో వచ్చే ముగ్గులు వేస్తూ ఉంటారు. అయితే, నక్షత్రం ఆకారంలో ముగ్గులు వేయడం వలన భూతప్రేత పిశాచాలను దరిదాపులకి రాకుండా అడ్డుకోవచ్చు. చుక్కల ముగ్గులు, ఇతర ముగ్గుల్లో కోణాలు ఉంటాయి. ఇవి కేవలం గీతలే కాదు. యంత్రాలు. యంత్ర, తంత్ర, శాస్త్ర రహస్యాలతో ఇవి ఉండడం వలన చెడు శక్తులు దరిచేరకుండా ఉంటాయి. అందుకనే ముగ్గు తొక్కకూడదు. చాలామంది ఇవి గీతలే కదా అని అనుకుంటారు. కానీ ఇంత రహస్యం ముగ్గులో దాగి ఉంది.

ఇలాంటి ముగ్గులు వేయకూడదు, తొక్కకూడదు

చాలామంది అందంగా ఉంటాయని ఓంకారం, స్వస్తిక్, శ్రీ గుర్తులని పోలిన ముగ్గులు వేస్తూ ఉంటారు. కానీ ఇలాంటివి వేయకూడదు. అలాగే వాటిని తొక్కితే కూడా పాపం తగులుతుంది. తులసి మొక్క దగ్గర అయితే ఎప్పుడూ కూడా అష్టదళ పద్మం ముగ్గును వేసి దీపారాధన చేస్తే మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు.

ముగ్గు వేస్తే ఎంత మంచిదో తెలుసా?

ఎవరైతే దేవాలయంలో, అమ్మవారు, మహావిష్ణువు ముందు ఎల్లప్పుడు ముగ్గులు వేస్తారో ఆమెకు 7 జన్మల దాకా వైధవ్యం రాదు. సుమంగళిగా చనిపోతుంది. దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం కూడా ఈ విషయాన్ని చెప్తున్నాయి. కలర్స్ తో కాకుండా బియ్యం పిండితో ముగ్గు వేస్తేనే మంచిది.

ఈ మూడు ప్రదేశాల్లో రోజూ తప్పక ముగ్గు పెట్టండి

ఎప్పుడూ కూడా ఇంటి ముందు, ఇంటి వెనుక భాగంలో కచ్చితంగా ముగ్గు వేయాలి. ఇలా ముగ్గు పెట్టడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలాగే తులసి మొక్క దగ్గర కూడా ముగ్గు వేయాలి. తులసి మొక్క దగ్గర ముగ్గు వేసి దీపారాధన చేస్తే లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది.

ఎప్పుడు ముగ్గు వేయకూడదు?

ముగ్గు లేదంటే అశుభం అని అర్థం. చాలామంది ఈ రోజుల్లో ముగ్గు వేయడానికి బద్ధకిస్తున్నారు. కానీ పూర్వం ముగ్గులేని ఇంటికి ఎవరు వెళ్లేవారు కాదు. ముగ్గు లేకపోతే సాధువులు, సన్యాసులు కూడా భిక్ష అడిగే వారు కాదు. కేవలం ఎవరైనా మరణించిన రోజు లేదంటే శ్రాద్ధ కర్మలు చేసిన రోజు మాత్రమే ముగ్గు వేయరు. శ్రార్ధ కర్మ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ముగ్గు వేసుకోవచ్చు. ముగ్గు వెనుక ఆరోగ్య, ఆధ్యాత్మికమైన రహస్య కోణాలు ఉన్నాయి. సామాజిక, మానసిక కోణాలు కూడా ముగ్గు వెనక దాగి ఉన్నాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం