మహావిష్ణువు వరహ అవతారంలో ఎందుకు వచ్చాడు?-story behind lord vishnu varaha avatar ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మహావిష్ణువు వరహ అవతారంలో ఎందుకు వచ్చాడు?

మహావిష్ణువు వరహ అవతారంలో ఎందుకు వచ్చాడు?

HT Telugu Desk HT Telugu
Oct 01, 2023 03:17 PM IST

Varaha Avatar : మహావిష్ణువు యొక్క అవతారాలలో ప్రత్యేకమైన అవతారము వరాహ అవతారం. ఈ అవతారం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ కొన్ని విషయాలు పంచుకున్నారు.

వరహ అవతారం
వరహ అవతారం

అనారోగ్య సమస్యలు తొలగడానికి, సంపదలను పొందడానికి వరాహ రూపంలో ఉన్న మహావిష్ణువును పూజిస్తారు. లోకకంఠకుడైన హిరాణ్యక్షుడను సంహరించడం కోసం వరాహ అవతారమెత్తి రాక్షససంహారము చేసి ఈ భూమండలాన్ని రక్షించినటువంటి మహావిష్ణువును పూజించడం వల్ల అభీష్టసిద్ధి కలుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

వరాహరూపంలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని కలశంలో పెట్టి దానిని నీటితో నింపి దానికి పూజ చేసిన తరువాత ఆ కలశాన్ని బ్రాహ్మణులకు దానం చేయడం కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయం. వరాహ జయంతిరోజు ఉపవాసం, వస్త్రదానం వంటివి ఆచరిస్తారు. మహావిష్ణువును పూజించి వరాహపురాణాన్ని పఠించి భగవద్దీత, భారతం వంటివి పారాయణ చేసినటువంటి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని చిలకమర్తి తెలియచేశారు. వరహుడికి సంబంధించి కథ కింది విధంగా ఉన్నదని చిలకమర్తి తెలిపారు.

అనంత భగవానుడు ప్రళభయకాలమందు జలమున మునిగిపోయిన పృథ్విని ఉద్ధరించుటకు వరాహ రూపము ధరించెను. ఒక దినము స్వాయంభువ మనువు వినయముగ చేతులు జోడించి తన తండ్రి అయిన బ్రహ్మదేవునిలో ఇట్లనెను. తండ్రీ! మీరు సమస్త జీవులకు జన్మదాతలు. జీవము నొసగువారు. మీకునా నమస్కారములు. నేను మిమ్ములను ఏవిధముగ సేవింపవలెనో ఆజ్ఞ ఇందు.

మనువు మాటలు వినిన బ్రహ్మ పుత్రా! నీకు శుభమగుగాక, నిన్ను గాంచి నేను ప్రసన్నుదనైతిని, నీవునా ఆజ్ఞను కోరితివి. ఆత్మసమర్పణము గావించితివి. పుత్రులు తమ తండ్రిని ఈవిధముగనే పూజింపవలెను. వారు తమ తండ్రి ఆజ్ఞను ఆదరములో పాలించవలెను. నీవు ధర్మపూర్వకముగ పృథ్విని పాలించుము. యజ్ఞములతో శ్రీహరిని ఆరాధింపుము. ప్రజలను పాలించుటయే నన్ను సేవించినట్లగును అని చెప్పగా.. మనువు ఇట్లనెను. పూజ్య పాదా! మీ ఆజ్ఞను అవశ్యము పాలించెదను. అయిననూ సర్వజీవులకు నివాసస్థానము అయిన భూమి ప్రళయ జలమందు మునిగి యున్నది. కావున నేనెట్లు భూమిని పాలింపగలను అని అడుగగా!

బ్రహ్మ, పృథ్విని గురించి చింతించుచూ దానిని ఉద్ధరించుటకు గాను ఆలోచింపసాగెను. అప్పుడు అకస్మాత్తుగ ముక్కునుండి బొటనవ్రేలు ఆకారమంత ఒక వరాహ శిశువు వచ్చేను. చూడంగానే అది పర్వతాకారము దాల్చి గర్జించసాగెను. బ్రహ్మదేవుడు భగవానుని ఘురఘురలు విని వానిని స్తుతించసాగెను. బ్రహ్మ స్తుతించుచుండ వరాహ భగవానుడు ప్రసన్నుడయ్యెను.

వరాహ భగవానుడు జగత్మళ్యాణము కోసం జలమందు ప్రవేశించెను. జలమందు మునిగియున్న పృథ్విని తన కోరలపై తీసికొని రసాతలము నుండి పైకి వచ్చుచుండగా పరాక్రమవంతుడైన హిరణ్యాక్షుడు జలమందే గదతో వరాహ భగవానునితో తలపడెను. సింహము, ఏనుగును వధించినట్లు వరాహ భగవానుడు క్రోధముతో హిరణ్యాక్షుని వధించెను. జలమునుండి వెలుపలకు వచ్చుచున్న భగవానుని బ్రహ్మాది దేవతలు గాంచి, చేతులు జోడించి స్తుతించసాగిరి. ప్రసన్నుడైన వరాహ భగవానుడు తన గిట్టలతో జలమును అడ్డగించి దానిపై పృథ్విని స్థాపించెను అని పురాణాలలో చెప్పినట్లుగా చిలకమర్తి తెలిపారు.

Whats_app_banner