Mahabharat : కురుక్షేత్రం ముగిశాక శునకం కోసం ధర్మరాజు పట్టు.. అతి గొప్ప జీవిత పాఠం-never forget those who helped ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mahabharat : కురుక్షేత్రం ముగిశాక శునకం కోసం ధర్మరాజు పట్టు.. అతి గొప్ప జీవిత పాఠం

Mahabharat : కురుక్షేత్రం ముగిశాక శునకం కోసం ధర్మరాజు పట్టు.. అతి గొప్ప జీవిత పాఠం

Galeti Rajendra HT Telugu
Aug 13, 2024 09:03 PM IST

Kurukshetra: కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన తర్వాత కొన్నాళ్లు రాజ్యపాలన చేసిన పాండవులు తిరిగి మళ్లీ ద్రౌపదితో కలిసి అడవులకి వెళ్లిపోతారు. ఆ సమయంలో వారి వెంట నడిచిన ఓ శునకం కోసం..

ధర్మరాజు, ఇంద్రుడు
ధర్మరాజు, ఇంద్రుడు

KurukshetraWar: కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కొన్నాళ్లకి పాండవులు మళ్లీ అడవులకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ మనవడు పరీక్షిత్‌ను హస్తినాపూర్ సింహాసనంపై కూర్చోబెట్టి.. ఐదుగురు సోదరులు ద్రౌపదితో కలిసి అడవికి బయలుదేరారు. రాజవాసం నుంచి మళ్లీ అడవికి వెళ్తున్న పాండవులను చూసి ప్రజలందరూ బాధపడ్డారు. పాండవుల వెంట నగర శివారు వరకు వచ్చి వీడ్కోలు పలికారు. కానీ.. అక్కడి నుంచి పాండవులను అనుసరిస్తూ ఒక శునకం మాత్రం అడవిలోకి వెళ్లింది.


ద్రౌపది పడిపోయినా

పాండవులు మొదట తూర్పున లౌహిత్య నుంచి ఆధునిక బ్రహ్మపుత్ర వరకు వెళ్లారు. అనంతరం ద్వారకకు చేరుకుని అక్కడ మునిగిపోయి ఉన్న నగరాన్ని చూసి బాధపడుతూ అలానే హిమాలయాలను దాటి ఉత్తరాన వెళుతూ ఉన్నారు. వారి ప్రయాణంలో శునకం వారితోనే ఉంది. కానీ హిమాలయాల వద్ద ఒకరి తర్వాత ఒకరు పాండవులు పడటం ప్రారంభించారు. మొదటగా ద్రౌపది పడిపోయింది. ఆ తర్వాత సహదేవుడు, నకులుడు, అర్జునుడు, చివరగా భీముడు కూడా పడిపోయి మరణించారు. తమ్ముళ్లు, భార్య పడిపోయి చనిపోతున్నా ధర్మరాజు మాత్రం కనీసం వెనక్కి తిరిగి చూడలేదు. అలానే ముందుకు నడవగా.. అతని వెంట శునకం కూడా నడుస్తూ వెళ్లింది.

ధర్మరాజును గమనించిన ఇంద్రుడు తన రథంతో వచ్చి స్వర్గానికి వెళ్దాం.. రథం ఎక్కు అని అడిగాడు. అప్పుడు వెనక్కి చూసిన ధర్మరాజు.. సోదరులు, ద్రౌపది చనిపోయి ఉండటాన్ని గమనించి వారిని కూడా తనతో స్వర్గానికి రావడానికి అనుమతించమని కోరుతాడు. దాంతో ఇంద్రుడు.. వారు మీ కంటే ముందే స్వర్గానికి వెళ్లిపోయారు. ఇక మీరే మిగిలారు.. రథం ఎక్కండని కోరారు. అప్పుడు ధర్మరాజు 'ఈ కుక్క విశ్వాసంగా మొదటి నుంచి నాతోనే కలిసి ప్రయాణిస్తోంది. దాన్ని కూడా నాతో పాటు స్వర్గానికి రానివ్వండి’ అని ధర్మరాజు కోరాడు.


కుక్క కోసం ఆగిన ధర్మరాజు


అప్పుడు ఇంద్రుడు ‘కుక్కలు స్వర్గానికి రాలేవు. కాబట్టి.. ఈ కుక్కని నువ్వు విడిచిపెట్టక తప్పదు’ అని బదులిచ్చాడు. దాంతో ధర్మరాజు వినయంగా.. ఈ కుక్క లేకుండా నేను స్వర్గానికి రాను అని ఖరాఖండిగా చెప్పేస్తాడు. దాంతో ఇంద్రుడు ‘నీ సోదరులను, భార్యను విడిచిపెట్టేశావు. కానీ.. ఈ కుక్కను ఎందుకు విడిచి పెట్టడం లేదు?’’ అని ప్రశ్నించాడు. దాంతో ధర్మరాజు వినయంగా ‘మనుషులకి చనిపోయిన వారితో స్నేహం లేదా శత్రుత్వం ఉండదు.. ఉండకూడదు. అందుకే నేను ఇప్పుడు జీవించి లేని వారిని విడిచిపెట్టాను. స్నేహితుడి పట్ల శత్రుత్వం, మనపై భక్తి ఉన్న వాటిని విడిచిపెట్టడం మహాపాపం’’ అని చెప్తాడు.

ధర్మరాజు మాటలకు కుక్క ఒక్కసారిగా ధర్మంగా మారిపోతుంది. స్వర్గానికి నిన్ను తీసుకెళ్లే ముందు ఇది పరీక్ష అని.. మీ ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారని ధర్మం చెప్తుంది.

మనం చాలా సందర్భాల్లో మన విజయానికి దోహదపడిన వారిని మర్చిపోతుంటాం. అందులో తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, భార్య లేదా పిల్లలు కూడా ఉండొచ్చు. మనకి సహాయపడ్డ వారిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటేనే ధర్మరాజు తరహాలో స్వర్గానికి అర్హులం అవుతాం.