Lord krishna: ఈ గుడిలో గంట కొట్టరు, భక్తి పాటలు మైకులో వినిపించవు.. ఎందుకో తెలుసా?-the bell is not rung in this temple devotional songs are not heard in the mike do you know why ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Krishna: ఈ గుడిలో గంట కొట్టరు, భక్తి పాటలు మైకులో వినిపించవు.. ఎందుకో తెలుసా?

Lord krishna: ఈ గుడిలో గంట కొట్టరు, భక్తి పాటలు మైకులో వినిపించవు.. ఎందుకో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Jul 11, 2024 10:09 AM IST

Lord krishna: సాధారణంగా ఆలయంలోకి వెళ్ళగానే గంట కొడతారు. కానీ ఈ గుడిలో మాత్రం గంట కొట్టరు, భక్తి పాటలు మైకుల్లో వినిపించవు. ఎందుకు? దీని వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా?

 బంకే బిహారీ దేవాలయం విశేషాలు
బంకే బిహారీ దేవాలయం విశేషాలు (pinterest)

Lord krishna: శ్రీకృష్ణుడు విష్ణువు అవతారంగా నమ్ముతారు. కృష్ణుడికి సంబంధించిన చిన్ననాటి కథలు ఇప్పటికీ అమ్మమ్మలు చెబుతూనే ఉంటారు. రాధా, గోపికలతో శ్రీకృష్ణుడు చేసిన లీలలు అన్ని ఎంతో ఆసక్తిగా ఉంటాయి. శ్రీకృష్ణుడు నడయాడిన ప్రదేశంగా బృందావనం చెప్తారు. ఇక్కడ ఉన్న బంకే బిహారీ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హోలీ వేడుకలు అంబరాన్ని అంటుతాయి.

ఈ ఆలయం చుట్టూ అనేక రహస్యాలు, ప్రత్యేక సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ గుడిలో గంటలు లేకపోవడం దగ్గర నుంచి కొన్ని నిమిషాల పాటు దేవుడు ఎవరికి కనిపించకుండా కర్టెన్ వేయడం వరకు ప్రతీదీ ఆశ్చర్యం కలిగించే అంశమే. ఈ ఆలయంలో భక్తి పాటలు మైకులో అసలు వినిపించవు. ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది.

గంటలు ఉండవు

సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా గంట మోగిస్తారు. అలాగే హారతి ఇచ్చేటప్పుడు గంట మోగిస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం గంటలు అనేవి ఉండవు. అది ఎందుకు అనేది ఇప్పటికే ఓ మిస్టరీగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనం మాత్రం ప్రాచుర్యంలో ఉంది.

బంకే బిహారీ దేవాలయంలో శ్రీకృష్ణుడి బాల్య రూపం పూజలు అందుకుంటుంది. సాధారణంగా మన ఇంట్లో చిన్న పిల్లలు నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా గంట మోగించడం, బిగ్గరగా పాటలు పాడటం వల్ల వాళ్ళు అరుస్తూ ఏడుస్తూ నిద్రలేస్తారు. అందుకే తల్లులు చిన్నపిల్లలు నిద్రపోతుంటే చాలా జాగ్రత్తగా శబ్ధం రాకుండా పనులు చేసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది.

ఈ ఆలయంలో ఉన్న కృష్ణుడు కూడా బాలుడే. కనుక ఇక్కడ కూడా ఎటువంటి గంటలు మోగించరు. ఈ ఆలయంలో గంటలు లేకపోవడానికి ప్రధాన కారణం ఇదే. గంటలు మోగించడం వల్ల చిన్ని కృష్ణుడు కలవరపడతారని భక్తులు నమ్ముతారు. అందుకే భక్తులు, పూజారులు చిన్ని కృష్ణయ్యను గౌరవిస్తూ గంటలు మోగించకుండా ఉంటారు. గంటలు మోగించడం వల్ల కన్నయ్య నిద్రకు భంగం వాటిల్లుతుందని విశ్వసిస్తారు.

భక్తిపాటలు వినిపించవు

ఇది మాత్రమే కాదు ఈ ఆలయంలో స్పీకర్లలో భక్తి పాటలు వినిపించవు. మైకులు పట్టుకొని పూజారులు ఎటువంటి పూజలు కూడా నిర్వహించరు. తెల్లవారుజామున దర్శనాల్లో, పండగల సమయంలో రద్దీ తప్ప మిగతా సమయంలో వాతావరణం ఈ ఆలయంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అర్చకులు, భక్తులు ప్రశాంతమైన సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. అందుకే ఈ ఆలయం అన్ని దేవాలయాల కంటే పూర్తి భిన్నంగా ఉంటుంది.

బంకే బిహారి ఆలయానికి సంబంధించి మరికొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రత్యేక సంప్రదాయం ఏమిటంటే కొన్ని సెకన్ల పాటు గర్భగుడిలో దేవుడు కనిపించకుండా కర్టెన్లు వేస్తారు. ఇలా ఎందుకు వేస్తారు అనే దానికి సంబంధించి పురాణాల ప్రకారం మరొక కథ ప్రాచుర్యంలో ఉంది.

శ్రీకృష్ణుడు తన పట్ల ప్రజల చూపించే ప్రేమ, భక్తికి ఎంతగానో ప్రభావితమైన సందర్భాలు చాలా ఉన్నాయి. భక్తులు ఆయన కళ్ళల్లోకి చూసి తమ కోరికను కోరుకున్నప్పుడు వారి అవసరం తీర్చేందుకు వారి ఇంటికి వెళ్లిపోతాడట. మళ్ళీ తిరిగి వచ్చేందుకు నిరాకరిస్తాడు. అందువల్ల పూజార్లు బాలకృష్ణుడి రూపాన్ని చూసి భక్తులు మైమర్చిపోయి చూస్తూ ఉంటారు. అలా భక్తులు కృష్ణుడిని తదేకంగా చూడకుండా ఉండడం కోసం ఇలా కర్టెన్లు వేస్తారని అంటారు. అది మాత్రమే కాదు ఈ కృష్ణుడిని అలాగే చూస్తూ ఉన్నారంటే మనకు తెలియకుండానే మన కళ్లలో నుంచి కన్నీళ్ళు వచ్చేసి ఏడుస్తారట.

WhatsApp channel