కార్తీకమాసంలో పత్తివత్తులు, ఉపవాసం, జాగరణ, కార్తీక స్నానం, ఆకాశదీపం విశిష్టత
కార్తీకమాసంలో పత్తివత్తులు, ఉపవాసం, జాగరణ, కార్తీక స్నానాలు, ఆకాశదీపంల విశిష్టత ఏమిటి? ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వివరాలు మీకోసం.
కార్తీక మాసంలో ప్రతీరోజూ ఇంటిలో గాని, గుడియందు గాని ఉదయము, సాయంత్రం లేదా కనీసం ప్రదోష కాల సమయంలో నువ్వుల నూనెతో గాని, ఆవునేతితో గాని దీపాలను వెలిగించాలి. ఇదీ కూడా సాధ్యపడని పక్షంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటివారు కార్తీక సోమవారాలు, కార్తీక ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులయందు దీపాలు వెలిగించడం వలన కార్తీక మాస దీప పుణ్య ఫలం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పత్తివత్తులు
పత్తి నుండి వచ్చిన సన్నని దారంతో మూడు పేటలుగా చేసి ఉంచిన దాన్నే దత్తి అనాలి. సంస్కృతంలో వర్తి అంటారు. లక్షవర్తి వ్రతం (లక్షవత్తుల వ్రతం) అంటారు. పదిమంది ఆడవాళ్ళు కలసి ఓ విష్ణు సహస్రనామాన్నో లలితా సహస్రనామాన్నో చదువుకుంటూ అందరూ కనుక వత్తుల్నే చేసుకున్నట్లయితే చెప్పలేనన్ని వత్తులు చేయగలుగుతారు.
అలా పత్తితో చేయబడిన వత్తి మాత్రమే నువ్వుల నూనెని తనదైన శైలిలో పీల్చుకుంటూ దీపధూమాన్ని విడుదల చేసి క్రిమికీటకాల్ని ధ్వంసం చేయగలదు అని చిలకమర్తి తెలిపారు.
ఉపవాసము
ఉపవాసమనగానే అసలు మంచినీళ్ళు కూడా తాగకుండా రోజులో ఎంతోసేపు ఉంటే పుణ్యం లభించేస్తుందని భావిస్తుంటారు. శరీరంలో నీటిశాతం తగ్గిపోయిన పక్షంలో అపస్మారక స్థితిలోకి వెళతాం. మన శరీరంలో నీటిశాతాన్ని పరీక్షించుకునే రోజుని ఏర్పాటుచేశారు బుుషులు. జ్యేష్టమాసంలో వచ్చేటువంటి ఏకాదశని నిర్జల ఏకాదశి అని పిలుస్తూ ఆ రోజున ఎంతసేపు నీటిని తాగకుండా ఉన్నా శరీరం తట్టుకోగలుగుతుందో గమనించుకుని నీ శరీర పరీక్షని నీకు నువ్వే చేసుకో అని తీర్మానం చేశారు బుుషులు. ఆ రోజున కూడా నీటిని తాగకుండా ఉండలేని స్థితి గనుక వస్తే వెంటనే తాగమన్నారు తప్ప నియమం చెడుతుందనే ఉద్దేశ్యంతో ప్రయత్నాన్ని కొనసాగించవద్దన్నారు.
కాబట్టి నీటిని తాగకుండా ఉంటూ దాన్ని ఉపవాసమనుకోవడం మూర్ఖత్వం, అజ్ఞానమని తేల్చి చెప్పింది శాస్త్రం. ప్రతి మూడు గంటలకీ నిమ్మరసాన్ని తేనె కలిపిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ దైవధ్యానాన్ని చేస్తూ ఉంటే అది ఉప వాసం అవుతుందని శాస్త్రం చెబుతోందని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
జాగరణం
జాగారం అని వ్యవహారంలో కన్పిస్తూంటుంది. ఆ మాట సరికాదు. జాగరణము అంటే తనని గురించి తాను మేల్కోవడమని అర్థం. పుట్టి ఎంతకాలమైంది? ఏవిధంగా ప్రతి సంవత్సరం ఎలా ఎలా అభివృద్ధికి రాగలిగాను? ఎప్పుడు నష్టపోయాను? ఏ కారణం వల్ల ఇబ్బందికి గురి అయ్యాను? మేల్కోవడం ఎలా? అని ఆలోచించుకుంటూ తనని గురించి తాను ఒక అవగాహనికి రావడం ఏదుందో అది జాగరణం తప్ప.. రాత్రంతా నిద్రలేకుండా, నిద్ర రాకుండా ఉండేందుకు వేటినో తాగుతూ ఉంటే అది జాగరణం కానే కాదు.
పెద్దలెప్పుడూ కూడా సమయానికి ప్రాధాన్యాన్నీ నష్టపోకుండా ఉండే తీరుని గమనించుకోవాలని చెప్పారు తప్ప ఓ రోజంతా మెలకువగా ఉండి మరురోజు నిద్రపోవాలని చెప్పనే చెప్పలేదు. మనకి అవగాహన లేక ఎవరైనా చెప్పినా వినక జాగరణ పదానికి అర్ధాన్ని మార్చేసుకున్నాం. జాగరణాన్ని చేస్తే జాగరణం వల్ల ఏ పుణ్యం వస్తుందని భావించామో, ఆ పుణ్యం రాదు సరికదా రెండు రోజుల్ని వ్యర్థం చేసుకున్నట్లే అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
కార్తీక స్నానాలు
కార్తీకమాసంలో స్నానాలను రోజూ తెల్లవారు జామునే చేస్తూ ఉంటే పుణ్యం లభిస్తుంది కోరికలు ఫలిస్తాయి అనే మాట సరికాదు. ఈ చలికీ, రాబోయే మరింత చలికీ తట్టుకోగలిగిన తీరుని శరీరానికి అలవాటు చేయడానికే ఈ స్నాన నియమాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు. స్నానమనేది తప్పనిసరి అని చెప్పి చిన్నపిల్లల్ని పెద్ద వయసు వాళ్ళని పుణ్యమనే అభిప్రాయంతో చన్నీటి స్నానాన్ని చేయిస్తే వాళ్లు అనారోగ్యం పాలవ్వవచ్చు. ఒక్కోసారి ప్రాణాపాయ స్థితి కూడా కలగవచ్చు.
అందుకని వేదాలు స్వయంగా మన ఇబ్బందిని గమనించి కొన్ని విధాలని చెప్పారు. ఆపోహిష్థామయోభువః అంటూ కొన్ని మంత్రాలున్నాయి. వాటిని చదువుకుంటూ చేసే స్నానాల్ని మంత్రస్నానాలన్నారు. ఆవు ఏ గోష్టంలో ఉంటుందో దాని గిట్టలతో తొక్కిన ఆ నేల మట్టి రేణువులని తలమీద చల్లుకుంటే చాలు కార్తీకస్నానం యథావిధిగా చేసిన ఫలితం వస్తుందని చెప్తూ దీన్ని వాయ్య స్నానమన్నారు. ఈ రేణువులు దొరకలేదంటే విభూతిని నుదుటికి ధరిస్నే దాన్ని ఆగ్నేయ స్నానమన్నారు. ఏదైన శరీరంలోని ఓ భాగానికి దెబ్బతగిలి నీటికి తడవకూడని పరిస్థితే గనుక వస్తే ఆ భాగాన్ని తప్ప మిగిలిన భాగాన్ని నీళ్ళు తడిపిన గుడ్డతో తుడిస్తే దాన్ని కాపిల స్నానమన్నారు.
శరీరంలో ఓపిక ఏ మాత్రమూ లేకుండా ఉంటే ఒక్కక్షణం ఎండ తగిలేలా చేస్తే చాలు దాన్ని ఆతప స్నానమన్నారు. ఏ ధ్యానమూ లేకుండా ఊరికే నీళ్ళలో మునిగితే దాన్ని వారుణ స్నానమన్నారు. స్నాం విష్ణోః స్మరణ పూర్వకమ్ గోవిందా అంటూనో శంకరా అంటూనో శరీరాన్ని నీటిలో ముంచుతూ స్నానం చేస్తే మానస స్నానమన్నారు. ఈ మానస స్నానం ఉత్తమోత్తమమని పురాణాలు చెబుతున్నాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆకాశదీప దర్శనం
ఈ కార్తీక మాసంలో పితృదేవతలందరూ తమ వారసులైనవారిని చూచి ఆశీర్వదించాలనుకుని అదృశ్య రూపంలో వస్తారు కాబట్టి దేవాలయంలో ధ్వజస్తంభం పైనపెట్టే ఆకాశ దీపానికి నమస్కరిస్తే వాళ్ళ అనుగ్రహాన్ని పొందినట్లు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.