Tholi ekadashi 2024: తొలి ఏకాదశి రోజు ఇలా చేశారంటే ప్రతి పనిలో విజయం పొందుతారు
Tholi ekadashi 2024: తొలి ఏకాదశి ఉపవాసం ఎందుకు ఆచరించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏకాదశి మహత్యం ఏంటి? అనే దాని గురించి ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
Tholi ekadshi 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అధికమాసం వంటివి వచ్చినప్పుడు 26 వరకు ఏకాదశులు వస్తాయని చిలకమర్తి తెలిపారు.
సంవత్సరంలో వచ్చే ఏకాదశులలో కొన్ని ఏకాదశులు చాలా ప్రత్యేకమైనవి, విశిష్టమైనవని ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అలా విశిష్టమైన ఏకాదశులలో శయన ఏకాదశి(తొలి ఏకాదశి), పరివర్తన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రద ఏకాదశి, నిర్జల ఏకాదశి చాలా ప్రత్యేకమైనవని చిలకమర్తి తెలిపారు.
తొలి ఏకాదశి ప్రాముఖ్యత
వీటిలో కూడ తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అత్యంత ప్రాధాన్యమైనవని చిలకమర్తి తెలిపారు. ఆషాడ మాస శుక్ల పక్ష ఏకాదశిని శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ ఏకాదశి నుంచే దక్షిణాయనం ఆరంభమవుతుంది. ఈ శయన ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించడం చేత ధ్యానంలో ఉండటం చేత ఈ ఏకాదశికి శయన ఏకాదశి అని పురాణాలు తెలియజేశాయని చిలకమర్తి పేరు వచ్చింది.
ఏకాదశి మహత్యం గురించి మహా భారతంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అరణ్య వాసంలో ఉన్నప్పుడు చెప్పినట్టుగా చెప్తారు. ఏకాదశి మహత్యం ప్రకారం ముర అనే రాక్షసుడు ఉండే వాడు. ఆ రాక్షసుడు మహా విష్ణువు దగ్గరకు వెళ్ళి బలవంతంగా యుద్ధం చేయాలని చెప్పి యుద్ధం చేశాడు. ఈ యుద్దం కొన్ని వేల సంవత్సరాలు విరామం లేకుండా జరిగింది. ఆ యుద్ధంలో శ్రీ మహా విష్ణువు అలసి పోయి విశ్రాంతి కోసం నిద్రించగా మహా విష్ణువు చెమట నుంచి ఒక కన్య ఉద్భవించింది.
ఆ సౌందర్య రాసిని ముర రాక్షసుడు తనను వివాహం ఆడాలని కోరాడు. అప్పడు ఆ కన్య నాతో యుద్ధం చేసి గెలిస్తే వివాహం చేసుకుంటానని చెప్పెను. అలా ముర రాక్షసుడు కన్యతో యుద్ధం చేసి ఓడిపోయి మరణించెను. అప్పుడు శ్రీ మహా విష్ణువు నిద్ర నుంచి మేల్కొని కన్య మురను సంహరించడం వల్ల ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టారు.
ఏకాదశి ఎవరు?
ఏకాదశి విష్ణువును కొన్ని వరాలు కోరింది. తాను విష్ణుమూర్తికి ప్రీతిపాత్రురాలుగా ఉండాలని, తన పేరు మీద ఒక తిథి ఉండి ఆరోజు విష్ణువును పూజించిన వారికి మోక్షం సిద్ధించాలని కోరింది. శ్రీ మహా విష్ణువు ఆమె కోరికలను అంగీకరించెను. ముర రాక్షసుడు నాకు కూడా జీవించే వరం ఇవ్వమని కోరగా ఎవరైతే ఏకాదశి రోజున అన్నపానాదులు స్వీకరిస్తారో, ఈ ముర అనే రాక్షసుడు క్రిముల రూపంలో అన్నంలో నివశించి వారికి కీడు కలిగించేననని వరమిచ్చేను. ఈ కథ ఆధారంగా ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజించి ఉపవాస దీక్షలు చేస్తారు. అందుకే ఏకాదశి రోజు అన్నం తినరని చిలకమర్తి తెలిపారు.
ఆయుర్వేదం ప్రకారం లంకణం పరమ ఔషధం. అందువల్ల ఏ వ్యక్తి అయితే నెలకు అమావాస్య లేదా పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించడం వల్ల వారికి పేగులకు సంబంధించి సమస్యలు తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుందని చిలకమర్తి తెలిపారు. శయన ఏకాదశి రోజు మహా విష్ణువును పూజించాలి. విష్ణు సహస్రనామ వంటిని పారాయణం చేయడం, భగవద్గీత చదువుకోవడం, ఏకాదశి ద్వాదశి వ్రతాలు ఆచరించడం వల్ల విష్ణు మూర్తి అనుగ్రహం కలిగి ప్రతి దాంట్లో విజయం పొందుతారని చిలకమర్తి తెలిపారు.
శయన ఏకాదశి రోజు విష్ణు మూర్తి ఆలయాలు దర్శించడం ఇంట్లో మహా విష్ణువును అష్టోత్తర శతనామావళితతో పూజించడం చేయాలి. విష్ణు మూర్తి ఆలయంలో అభిషేకం లేదా అర్చన చేయడం వల్ల కార్యముల యందు విజయాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.