Dakshinayanam: నేటి నుంచి దక్షిణాయనం ప్రారంభం.. దీని ప్రాముఖ్యత ఏంటి? ఈ సమయంలో ఏం చేయాలి?
Dakshinayanam: జులై 16 నుంచి దక్షిణాయనం ప్రారంభమైంది. దీన్ని కర్కాటక సంక్రాంతి అంటారు. దీని ప్రాముఖ్యత ఏంటి? ఈ సమయంలో ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
Dakshinayanam: గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు ప్రతినెల తన రాశిని మార్చుకుంటాడు. సూర్యుడు ఏ రాశిని మారిస్తే ఆ సంక్రాంతిగా పిలుస్తారు. ఏడాదికి పన్నెండు సంక్రాంతులు వస్తాయి. వాటిలో ఎక్కువగా మకర సంక్రాంతి, మిథున సంక్రాంతి, కర్కాటక సంక్రాంతికి ప్రాముఖ్యత ఉంటుంది.
జులై 16, 2024న సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించాడు. దీన్ని కర్కాటక సంక్రాంతి అంటారు. పురాణాల ప్రకారం కర్కాటక సంక్రాంతి రోజుల భక్తులు పవిత్ర నదులలో స్నానం చేసి సూర్య భగవానుడిని పూజించాలి. ఈ పండుగ నాడు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. హిందూ మంతంలో కర్కాటక సంక్రాంతి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఉత్తరాయణ కాలం ముగిసి ఈరోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచి పగలు తక్కువ సమయం, రాత్రి వెల ఎక్కువ సమయం ఉంటుంది. ఈ దక్షిణాయనం మకర సంక్రాంతితో ముగుస్తుంది.
కర్కాటక సంక్రాంతి సమయం నుంచి వాతావరణంలో మార్పులు ఉంటాయి. పూర్వం దక్షిణాయనం, ఉత్తరాయణం నుంచే కాలాలు గుర్తుంచుకునే వాళ్ళు. దక్షిణాయనం నుంచి వర్షాకాలం మొదలవుతుంది. వ్యవసాయ పనులు ప్రారంభంఅవుతాయి. తీవ్రమైన వేడి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది.
కర్కాటక సంక్రాంతి ప్రాముఖ్యత
కర్కాటక సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు దక్షిణాయనంలో ఉంటాడు. ఇక ఆరు నెలలు సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకర రాశులలో ప్రత్యామ్నాయంగా నెల పాటు ఉంటూ వస్తాడు. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు చాతుర్మాసం ప్రారంభాన్ని సూచిస్తుంది. విష్ణువు ఈ సమయంలో యోగ నిద్రలోకి వెళతాడు. నాలుగు నెలల పాటు విష్ణువు నిద్రావస్థలో ఉంటాడు. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు నిలిచిపోతాయి. మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి విష్ణుమూర్తి మేల్కొంటాడని నమ్ముతారు.
ఈ సమయంలో వచ్చే ఏకాదశిని దేవశయన ఏకాదశిగా పిలుస్తారు. ఈ కాలంలో విష్ణువు, సూర్య భగవానుడిని పూజిస్తారు. ఈరోజు అన్నదానం, వస్త్ర దానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరడం కోసం తర్పణాలు సమర్పిస్తారు. అందుకే కర్కాటక సంక్రాంతిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
జ్యోతిష్య ప్రాముఖ్యత
జ్యోతిష్య శాస్త్ర పరంగా కర్కాటక సంక్రాంతికి ప్రాధాన్యత ఉంది. సూర్య భగవానుడి వాహనం ఏనుగు. ఈ సమయంలో పశ్చిమ దిశలో కాదులుతుంది. అటువంటి పరిస్థితిలో పశుపక్ష్యాదులకు మేలు చేస్తుంది. ప్రజల జీవితాలలో సంపద, శ్రేయస్సు కలిగిస్తుంది. అయితే వర్షాకాలం ప్రారంభం కావడం వల్ల అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ సమయంలో ఆరోగ్యం గురించి జాగ్రత్తగా చూసుకోవాలి.
సూర్యుడిని ఎలా పూజించాలి?
కర్కాటక సంక్రాంతి రోజు దానధర్మాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్య మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి. విష్ణువు నిద్రకాలం కనుక శ్రీహరి విష్ణు మంత్రాలు జపించాలి. విష్ణు కవచం, విష్ణు సహస్రనామాన్ని పఠించండి.
విశ్వాసాల ప్రకారం కర్కాటక సంక్రాంతి రోజు పేదలకు, బ్రహ్మణులకు ఆహారం, నూనె, ఇతర వస్తువులను దానం చేయడం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ పవిత్రమైన రోజున జంతువులు, పక్షులకు ఆహారం ఇవ్వాలి. సూర్య భగవానుడి ఆశీర్వాదాలు పొందటం కోసం సూర్య మంత్రాలు లేడా గాయత్రీ మంత్రాన్ని జపించాలి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.